ఆ వర్గానికి చెందినంత మాత్రాన ప్రత్యేక మినహాయింపు ఉండదు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ పోలీస్ నియామకాల్లో శారీరక పరీక్షకు హాజరుకాని ఒక అభ్యర్థి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వెనుకబడిన వర్గానికి చెందిన వారైనంత మాత్రాన నిబంధనల నుంచి మినహాయింపు ఉండదని, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రమశిక్షణ, సమానత్వం ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. ఆ వివరాలు..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలు, శారీరక పరీక్షల విషయంలో అభ్యర్థులు కచ్చితమైన క్రమశిక్షణ పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గానికి చెందినవారు అనే కారణంతో నిబంధనలను ఉల్లంఘించడం లేదా ప్రత్యేక సానుభూతిని ఆశించడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఒక అభ్యర్థి రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ, జనవరి 2024లో జరగాల్సిన శారీరక సామర్థ్య పరీక్షకు అనారోగ్యం కారణం చూపిస్తూ హాజరు కాలేదు. తనకు మరో అవకాశం ఇవ్వాలని అతను కోరగా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT), ఢిల్లీ హైకోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చాయి. దీనిని సవాలు చేస్తూ ఢిల్లీ పోలీస్ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు:
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ క్రింది విధంగా తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సానుభూతి, దయ లేదా సామాజిక నేపథ్యం వంటి అంశాలకు చోటు ఉండకూడదు. అందరికీ సమానమైన పోటీ వాతావరణం ఉండాలి. అభ్యర్థి శారీరక పరీక్షకు హాజరుకాకపోవడాన్ని “బాధ్యతారాహిత్యం”గా కోర్టు పేర్కొంది. లక్షలాది మంది పోటీపడుతున్నప్పుడు నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, ఒక వ్యక్తి కోసం షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదని తెలిపింది. తాను వెనుకబడిన వర్గానికి చెందినవాడిని కాబట్టి తనకు మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థి వాదనను కోర్టు తిరస్కరించింది. “వెనుకబడిన వర్గానికి చెందినంత మాత్రాన అది నిర్ణయాత్మక అంశం కాకూడదు” అని పేర్కొంది.
