Indian Railways: దేశంలోని ఏకైక డైమండ్ క్రాసింగ్.. భారత రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం.. రైళ్లు నాలుగు వైపులా దుసుకెళ్తాయి..
సాధారణంగా రైల్వే లైన్లు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. లేదా జంక్షన్ల వద్ద కలుస్తాయి. కానీ, నాగ్‌పూర్‌లోని ఈ డైమండ్ క్రాసింగ్ వద్ద మాత్రం రైలు పట్టాలు ఒకదానికొకటి నిలువుగా (90 డిగ్రీల కోణంలో) ఖండించుకుంటాయి. రైళ్లు అన్ని దిశల నుండి వస్తాయి. అయినా, అవి ఎప్పుడూ ఢీకొనవు.. భారత రైల్వే ఇంజనీరింగ్ అద్బుతమైన డైమండ్ క్రాసింగ్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో గల నాగ్‌పూర్‌లో ఈ అరుదైన డైమండ్ క్రాసింగ్ ఉంది. రైల్వే ట్రాక్‌లు వజ్రం ఆకారంలో ఒకదానికొకటి క్రాస్ అవుతూ ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ భారతదేశం నలుమూలల నుండి వచ్చే రైలు మార్గాలు కలుస్తాయి. ఉత్తరం నుండి ఢిల్లీ, దక్షిణం నుండి చెన్నై, తూర్పు నుండి హౌరా (కోల్‌కతా), పడమర నుండి ముంబై వైపు వెళ్లే రైలు పట్టాలు ఇక్కడే ఒకదానికొకటి ఖండించుకుంటాయి.
నాలుగు వైపుల నుండి రైళ్లు వస్తున్నప్పటికీ, ఇక్కడ రైళ్లు ఢీకొనడం అనేది జరగదు. దీనికి కారణం పకడ్బందీగా ఉండే సిగ్నలింగ్ వ్యవస్థ, ఇంటర్లాకింగ్ టెక్నాలజీ. ఏ సమయంలో ఏ రైలు పట్టాలపైకి రావాలి, ఏ రైలు ఆగాలి అనేది అత్యాధునిక కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. రెండు రైల్వే లైన్లు ఒకదానికొకటి క్రాస్ అయినప్పుడు మధ్యలో ఏర్పడే ఖాళీ ప్రదేశం వజ్రం (Diamond) ఆకారంలో కనిపిస్తుంది. దీనినే డబుల్ జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఇలా నాలుగు దిశల రైలు మార్గాలు ఒకే చోట కలుసుకునే డైమండ్ క్రాసింగ్ భారతదేశంలో నాగ్‌పూర్‌లో మాత్రమే ఉంది. ఇది భారతీయ రైల్వే ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిదర్శనం.
సాంకేతికంగా ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం అయినప్పటికీ, దశాబ్దాలుగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రైళ్లను సురక్షితంగా మళ్లించడంలో ఈ క్రాసింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. రైల్వే ప్రేమికులకు, పర్యాటకులకు ఇది ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.




