Supreme Court: అల్లోపతిపై మీరు చేసిన అసలు రికార్డులు సమర్పించండి.. బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అల్లోపతి మందుల గురించి చేసిన వ్యాఖ్యల అసలు రికార్డులను సమర్పించాలని బాబా రామ్‌దేవ్‌ను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.

Supreme Court: అల్లోపతిపై మీరు చేసిన అసలు రికార్డులు సమర్పించండి.. బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు
Supreme Court Asks Ramdev Baba To Place The Original Records
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 30, 2021 | 2:38 PM

Supreme Court asks Baba Ramdev: కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అల్లోపతి మందుల గురించి చేసిన వ్యాఖ్యల అసలు రికార్డులను సమర్పించాలని బాబా రామ్‌దేవ్‌ను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశించింది. రామ్‌దేవ్ తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తన విచారణను నిలిపివేయాలని బాబా రాందేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం.

‘‘ఆయన చెప్పిన అసలు మాటలు ఏమిటి? మీరు మొత్తం వివరాలను సమర్పించలేదు’’ అని ముకుల్ రోహత్గిని ఉద్దేశించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దీనిపై స్పందించిన రోహత్గి.. ఒరిజినల్ వీడియోను, దానిలోని మాటలను రాసిన పత్రాలను సమర్పిస్తానని కోర్టుకు నివేదించారు. దీంతో తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో అల్లోపతి మందులను వాడటంపై రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శాఖలు కేసులను దాఖలు చేశాయి. ఆయన వ్యాఖ్యలు కోవిడ్ నియంత్రణకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రజలు సరైన వైద్య చికిత్సను పొందకుండా నిరుత్సాహపరిచే అవకాశం ఉందని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిపై విచారణను నిలిపేయాలని కోరుతూ బాబా రామ్‌దేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తనపై పాట్నా, రాయ్‌పూర్‌లలో నమోదైన కేసుల విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలని బాబా రామ్‌దేవ్ సుప్రీంకోర్టును కోరారు. బాబాకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌నే ఆయన చదివారని ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. డాక్టర్లపై కానీ, ఇతరులపై కానీ తనకు వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారన్నారు. అల్లోపతిపై వ్యాఖ్యలు సరైనవి కాదని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొనడంతో బాబా రామ్‌దేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

Read Also….. AP cabinet meeting: 9 నుంచి 12వ‌ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్ టాప్‌ల పంపిణీకి కేబినెట్ ఆమోదముద్ర