‘హెల్ప్ ప్లీజ్ !’ ఇరాన్ లో చిక్కుకుపోయిన తమిళ జాలర్ల అభ్యర్థన

చైనాను వదిలి ఇరాన్ ను పట్టుకున్న కరోనా.. అక్కడ చిక్కు బడిన తమిళ జాలర్లకు చుక్కలు చూపుతోంది. ఈ రాష్టానికి చెందిన సుమారు 400 మందికి పైగా మత్స్య కారులు తమను వెంటనే ఇండియాకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ..

'హెల్ప్ ప్లీజ్ !' ఇరాన్ లో చిక్కుకుపోయిన తమిళ జాలర్ల అభ్యర్థన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 02, 2020 | 1:24 PM

చైనాను వదిలి ఇరాన్ ను పట్టుకున్న కరోనా.. అక్కడ చిక్కు బడిన తమిళ జాలర్లకు చుక్కలు చూపుతోంది. ఈ రాష్టానికి చెందిన సుమారు 400 మందికి పైగా మత్స్య కారులు తమను వెంటనే ఇండియాకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ.. ఎస్ ఓ ఎస్ వీడియో విడుదల చేశారు. ఇరాన్ లో ఇప్పటికే  కరోనా వ్యాధికి గురై 50మందికి పైగా మరణించగా.. దాదాపు వెయ్యిమందికి  కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. తమ దగ్గరున్న ఆహారం , ఇంధనం అయిపోతున్నాయని, కనీసం తమను రక్షించుకోవడానికి మాస్కులైనా లేవని ఈ తమిళ జాలర్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. దుబాయ్ నుంచి ఇరాన్ వెళ్లిన వీరి ఫుడ్ ఇక కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపోతుందట. తమలో ఏ ఒక్కరు కరోనాకు గురైనా ఇతరులకు కూడా ఇది సోకే అవకాశం ఉందని జాన్సన్ అనే మత్స్య కారుడు అన్నారు. వీరికి కేవలం తమిళం  తప్ప మరో భాష రాకపోవడంకూడా ఇబ్బందికరంగా మారింది. తాము ఉన్న కిష్ దీవికి దగ్గరగా విమానాశ్రయం ఉందని, అందువల్ల తమను సులువుగా ఎయిర్ లిఫ్ట్ చేయవచ్ఛునని ఈ జాలర్లు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరంగా తమను కాపాడాలని వీరు వేడుకుంటున్నారు. తమిళనాడు సీఎం కె.పళనిసామి వీరి అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వీరి కుటుంబాలు తమవారి రాకకోసం వెయ్యి కళ్ళతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.

ఇక ఇలాగే  కేరళకు చెందిన సుమారు 60 మంది జాలర్లు కూడా ఇరాన్ లో చిక్కుకుపోయారు. తాము తమ గదులనుంచి రాలేకపోతున్నామని, వీరు సైతం ఎస్ ఓ ఎస్ వీడియో ద్వారా తెలిపారు. ఒకే గదిలో 20 నుంచి 24 మంది వరకు ఉంటున్నామని, తమను వెంటనే రక్షించాలని కేరళ జాలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్.. వీరి దుస్థితిపై  విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కి లేఖ రాశారు. మరోవైపు.. ఇరాన్ లో చిక్కుకుపోయిన వందలాది కాశ్మీరీ విద్యార్థుల పరిస్థితి కూడా ఈ జాలర్ల మాదిరే ఉంది.