India-China Border Dispute: భారత సరిహద్దుల్లో చైనా కుట్ర.. వంతెన నిర్మాణంపై అమెరికా ఆందోళన..
భారత సరిహద్దుల్లో చైనా చేపట్టిన వంతెన నిర్మాణంపై అమెరికా (US commander) జనరల్ చార్లెల్ ఏ ఫ్లాయన్ ఆందోళన వ్యక్తం చేశారు.

India-China Border Dispute: భారత సరిహద్దులో చైనా కవ్వింపులు కొత్తేమీ కాదు.. కానీ ఇటీవలి కాలంలో చొరబాట్లతో పాటు నిర్మాణాల విషయంలో దూకూడు పెంచింది. ఇటీవల లడఖ్‌లో చైనా మరో వంతెన నిర్మాణం చేపట్టడం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా బయట పడింది. పాంగాంగ్ సరస్సుపై చేపట్టిన అక్రమ వంతెన నిర్మాణం తుది దశకు చేరడంతో పాటుగా మూడు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చైనా చేపట్టిన వంతెన నిర్మాణంపై అమెరికా (US commander) జనరల్ చార్లెల్ ఏ ఫ్లాయన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత సరిహద్దులో డ్రాగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. హిమాలయాల పొడవునా చైనా రక్షణ వ్యవస్థల ఏర్పాటు, నిర్మాణాలు చేపడుతున్న తీరు చూస్తుంటే పొరుగు దేశాలను అస్థిరపరిచే, ఆక్రమించే వైఖరిని అవలంభిస్తోందన్నారు. వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో చైనా చేపట్టిన నిర్మాణాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయన్నారు. ఈ ఆక్రమణ వైఖరిని సమష్టిగా అడ్డుకోవడం చాలా అవసరమని చార్లెల్ ఏ ఫ్లాయన్ పేర్కొన్నారు.
ఇండో-పసిఫిక్ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్న అమెరికా జనరల్ చార్లెల్ ఏ ఫ్లాయన్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు జర్నలిస్టులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా దళాలు గత ఏడాది అక్టోబర్‌లో ‘యుద్ధ అభ్యాస్’ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను మరింతగా పెంచాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..