Pralhad Joshi: నా సోదరుడితో 30 ఏళ్ల నుంచి సంబంధాలు లేవు: ప్రహ్లాద్ జోషి

2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశారని మాజీ జేడీఎస్ ఎమ్మెల్యే సునీత చౌహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుడు గోపాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఈ కేసుపై ప్రహ్లాద్ జోషి స్పందించారు.

Pralhad Joshi: నా సోదరుడితో 30 ఏళ్ల నుంచి సంబంధాలు లేవు: ప్రహ్లాద్ జోషి
Pralhad Joshi
Follow us

|

Updated on: Oct 18, 2024 | 6:36 PM

కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి బంధువులపై బెంగళూరు పోలీసులు గురువారం చీటింగ్ కేసు నమోదు చేసిన వార్తలు తాజాగా వైరల్ అయ్యాయి.  బసవేశ్వరనగర్ పోలీసుల కథనం ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశారని మాజీ జేడీఎస్ ఎమ్మెల్యే సునీత చౌహన్.. కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ మేరకు గోపాల్ జోషి (ఏ1), విజయలక్ష్మి జోషి (ఏ2), గోపాల్ కొడుకు అజయ్ జోషి (ఏ3)పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం చీటింగ్, నమ్మకద్రోహం, ఎస్సీ/ఎస్సీ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తాజాగా స్పందించారు. మూడు దశాబ్దాల ముందు నుంచి తన సోదరుడు గోపాల్ జోషితో సంబంధాలు లేవని  శుక్రవారం స్పష్టం చేశారు. తన సోదరుడు, బంధువులు లేదా స్నేహితులు అని చెప్పుకునే ఎవరితోనైనా ఆర్థిక సంబంధాలు పెట్టుకుంటే.. ఆ అంశాలతో తనకు సంబంధం లేనట్లు గతంలోనే పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన అఫిడవిడ్ కోర్టులో దాఖలు చేశానన్నారు.

“మొదటిగా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న విజయలక్ష్మి అనే మహిళను నా సోదరిగా చెబుతున్నారు. నాకు సోదరి లేరని అందరూ గమనించాలి” అని జోషి విలేకరుల సమావేశంలో చెప్పారు. తనకు నలుగురు సోదరులు ఉన్నారని, వారిలో ఒక సోదరుడు చాన్నాళ్ల క్రితమే చనిపోయాడని, తనకు సోదరి లేదని ఆయన వివరించారు “సోదరుడు గోపాల్‌తో ఎప్పుడో సంబంధాలు తెంచుకున్నా. అతని ప్రవర్తనపై కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు… అతనితో నా పేరును లింక్ చేయవద్దని బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను. 22.11.2013న కోర్టు ముందు ఉంచిన అఫిడవిట్‌లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి,” అని ప్రహ్లాద్ జోషి చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలను మీడియాకు అందజేశారు.

పోలీసులు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్… దాఖలు చేసినందున విచారణ నిష్ఫాక్షపాతంగా చేయాలని కోరారు.  చట్టం తన పని తాను చేసుకుపోతుందని..  విచారణకు తాను అడ్డు రానని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..