- Telugu News Photo Gallery Business photos New IRCTC train ticket reservation rules! Indian Railways changes advance booking rules
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. టికెట్ రిజర్వేషన్ రూల్ మారింది..!
టికెట్ రిజర్వేషన్లకు సంబంధించిన రూల్స్‌లో రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. ఇప్పటి వరకు ప్రయాణానికి ముందు 120 రోజుల నుంచే టికెట్ రిజర్వేషన్లు చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ కాల వ్యవధిని 60 రోజులకు తగ్గిస్తూ ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Updated on: Oct 18, 2024 | 6:14 PM

రైల్వే ప్రయాణీకులు మస్ట్‌గా తెలుసుకోవాల్సిన అంశమిది.. రైల్వే టికెట్ రిజర్వేషన్ రూల్ మారింది. రిజర్వేషన్ల కాల వ్యవధికి సంబంధించిన రూల్స్‌లో మార్పులు చేస్తూ భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్యాసింజర్లు తమ ప్రయాణానికి 120 రోజులు ముందు నుంచే టికెట్ రిజర్వేషన్ (అడ్వాన్స్ బుకింగ్) చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే ఈ కాల వ్యవధిని 60 రోజులకు కుదిస్తూ ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

గతంలో 60 రోజుల ముందే రైల్వే టికెట్ బుకింగ్‌కు వెసులుబాటు ఉండేది. అయితే ఆ తర్వాత ఐఆర్‌సీటీసీ దీన్ని 120 రోజులు (4 మాసాలు)కు పెంచింది. ఇప్పుడు ఈ నిబంధనలో మార్పు చేస్తూ పాత వ్యవధికే కుదించింది.

టికెటు రిజర్వేషన్లకు సంబంధించి ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన.. 2024 నవంబరు 1 తేదీ నుంచి అమలులోకి వస్తుంది. అంటే అక్టోబర్ 31 వరకు కూడా పాత నిబంధన మేరకు.. 120 రోజుల వరకు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్లకు సంబంధించి బుకింగ్ వ్యవధి తక్కువగా ఉన్నందునే.. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే విదేశీ పర్యటకులకు ప్రస్తుతం 365 రోజులు ముందుగానే రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తుండగా.. ఇందులోనూ ఎలాంటి మార్పు ఉండదు.

ఐఆర్‌సీటీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో రైల్వే శాఖకు వచ్చే ఆదాయం తగ్గే అవకాశముంది. రిజర్వేషన్ కాలవ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించడంతో.. క్యాన్సలేషన్స్ భారీగా తగ్గే అవకాశముంది.




