Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్పలకు గుడ్‌న్యూస్! దర్శనం స్లాట్‌లు, వసతి ఇలా బుక్ చేసుకోండి..
ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈసారి రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో, భక్తుల సౌకర్యార్థం వర్చువల్ క్యూ (దర్శనం స్లాట్), పూజలు, వసతి కోసం ఆన్‌లైన్ రిజర్వేషన్ సేవలను ప్రారంభించారు. ఈ వసతి ధరలు బుకింగ్ వంటి విషయాలు తెలుసుకుందాం..

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు స్వాగతం పలుకుతూ, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దీక్ష తీసుకున్న భక్తుల సంఖ్య పెరగడంతో, రవాణా సంస్థలు ప్రత్యేక రైళ్లు, బస్సు సర్వీసులను నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు వసతి, పూజలు, దర్శనం కోసం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారు.
ఆన్‌లైన్ సేవలు సమస్యలు:
సన్నిధానంలో పూజలు, వర్చువల్ క్యూ (V-Q) బుకింగ్, ఆన్‌లైన్ వసతి బుకింగ్ సేవలను నవంబర్ 5న ప్రారంభించారు. అయితే, ప్రారంభంలోనే రద్దీ కారణంగా వెబ్‌సైట్ సక్రమంగా పనిచేయలేదని, పాస్‌వర్డ్ అందకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారని ఫిర్యాదులు అందాయి. ఒకేసారి ఎక్కువ మంది లాగిన్ చేయడం వలన సర్వర్‌లో సాంకేతిక లోపం ఎదురైందని TDB వివరించింది.
దర్శనం స్లాట్ వసతి బుకింగ్ విధానం:
రోజుకు 70,000 మందికి పైగా భక్తులు వర్చువల్ క్యూ వెబ్‌సైట్ ద్వారా స్లాట్‌లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేని వారి కోసం, వండిపెరియార్, ఎరుమేలి, నీలక్కల్ (శివం), పంబా వద్ద రియల్ టైమ్ బుకింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా రోజుకు గరిష్టంగా 20,000 మంది భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నారు.
బుకింగ్ వెబ్‌సైట్: పూజలు, వర్చువల్ క్యూ, వసతి సేవల కోసం భక్తులు www.onlinetdb.com వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
వసతి ఫీజు వివరాలు:
ఆన్‌లైన్ సేవలు పొందడానికి భక్తులకు మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా అవసరం. ముందుగా రిజిస్టర్ చేసుకుని, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యాకే గదులు బుక్ చేసుకోవచ్చు. శబరిమలలో వసతి సౌకర్యాలు రూ. 80 నుంచి ప్రారంభమై, గది స్థాయిని బట్టి రూ. 2,200 వరకు ఫీజు వసూలు చేస్తారు.
ముఖ్య సూచన: ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో ఇచ్చిన ఫోటో సహా IDని యాత్రికులు తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.




