Crime News: రూ.6 కోట్ల ఆభరణాలు దోచుకెళ్లి.. టీ తాగడానికి డబ్బుల్లేక.. పోలీసులకు చిక్కిన ముఠా
ఎంత ధనవంతులైనా ఒక్కోసారి ఆకస్మాతుగా జేబులో డబ్బులేక అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. ఎంత తెలివైన వాడైనా తాను చేసే ఓ తెలివి తక్కువ పనితో బొక్క బోర్లా పడతాడు. ఎంత పెద్ద దొంగ..
Crime News: ఎంత ధనవంతులైనా ఒక్కోసారి ఆకస్మాతుగా జేబులో డబ్బులేక అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. ఎంత తెలివైన వాడైనా తాను చేసే ఓ తెలివి తక్కువ పనితో బొక్క బోర్లా పడతాడు. ఎంత పెద్ద దొంగ అయినా.. ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేసి దొరికేస్తాడు. ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఢిల్లీలో భారీ చోరికి పాల్పడి.. రాజస్థాన్ వెళ్లి టీ తాగడానికి జేబులో డబ్బులు లేక, పేటీఎం పేమెంట్ చేసి పోలీసులకు దొరికిపోయింది ఓ దొంగల ముఠా. ఢిల్లీలోని పహర్ గంజ్ ప్రాంతంలో ఓ ప్రయివేట్ కొరియర్ కంపెనీ ఎంతో విలువైన బంగారు ఆభరణాలను ఓప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణ చేస్తుంది. ఈవిషయం తెలుసుకున్న నజఫ్ గడ్ కు చెందిన నలుగురు వ్యక్తులు కొరియర్ సంస్థకు చెందిన వ్యక్తుల కళ్లలో కారం కొట్టి రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుండగులు నలుగురు, ఇద్దరు, ఇద్దరుగా విడిపోయారు. ఇద్దరిలో ఒకరు పోలీసు యూనిఫాం వేసుకున్నారు. చంఢీగఢ్, లుధియానాకు కన్‌సైన్‌మెంట్ పంపించేందుకు పహర్ గంజ్ లోని కొరియర్ కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు ఆఫీసు నుంచి బయటకు రాగా.. తాము పోలీసులమని చెప్పి దుండగులు వారిని బెదిరించారు. వీరిద్దరు కొరియర్ సంస్థకు చెందిన ఉద్యోగులతో మాట్లాడుతుండగా.. మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉద్యోగుల కళ్లలో కారం చల్లి.. నలుగురు కలిసి పార్మిల్ తీసుకుని పారిపోయారు.
ఈఘటనపై బుధవారం తెల్లవారుజామున కొరియర్ కంపెనీకి చెందిన ఉద్యోగుల్లో ఒకరైన చండీగఢ్ కు చెందిన సోమ్ వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో, తన సహోద్యోగి జగదీప్ సైనీతో కలిసి పహర్‌గంజ్‌లోని కొరియర్ సంస్థ కార్యాలయం నుండి పార్శిళ్లను తీసుకొని డిబిజి రహదారి వైపు వెళ్తుండగా.. మిలీనియం హోటల్ సమీపంలో వీరిని ఆపి తాము పోలీసులమంటూ దుండగులు బెదిరించారు. కొరియర్ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దాదాపు 700 సిసిటివి ఫుటేజీలను తనఖీ చేసి నిందితుల ఆచూకీ కనిబెట్టారు. చోరీ చేసిన తర్వాత వీరు రాజస్థాన్ కు పారిపోయారు. నిందితులు ఓ టీస్టాల్ లో టీ తాగినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ టీ యజమాని దగ్గరకు వెళ్లి విచారించారు. టీ యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు దుండగులను పట్టుకున్నారు. రాజస్థాన్ లో టీస్టాల్ లో టీ తాగిన తర్వాత డబ్బులు చెల్లించడానికి పేటీయం ద్వారా చేస్తానని చెప్పడంతో తన దగ్గర యూపీఐ ద్వారా డబ్బులు తీసుకునే విధానం లేదని, తనకు క్యాష్ ఇవ్వాలని అడగడంతో.. అటుగా వెళ్తున్న ఓ క్యాబ్ డ్రైవర్ ని ఆపి, ఆక్యాబ్ డ్రైవర్ కు రూ.100 పేటీఎం చేసి డబ్బులు తీసుకుని టీ స్టాల్ యజమానికి చెల్లించారు. టీ స్టాల్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కనుగొన్నారు. అతణ్ని ప్రశ్నించగా.. నిందితుల్లో ఒకరు తనకు రూ.100 పేటీఎం చేశాడని క్యాబ్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. పేటీఎం ట్రాన్సాక్షన్ ఆధారంగా.. పేటీఎం ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించిన పోలీసులు.. అతడి ఫోన్ నంబర్‌ను గుర్తించారు. దీంతో కేసులో ప్రధాన చిక్కుముడి వీడింది. నిందితుణ్ని ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో నివాసం ఉండే వ్యక్తిగా గుర్తించారు.
పోలీసు బృందాలు నజాఫ్‌గఢ్ వెళ్లే సరికే నిందితుడు మిగతా వాళ్లతో కలిసి ఇంట్లో నుంచి పారిపోయాడు. వీరిపై పూర్తి నిఘా పెట్టిన పోలీసులు.. తర నిందితుల ఫోన్ నంబర్లు సేకరించి వారి జాడ కనిపెట్టారు. ముగ్గురు నిందితులు జైపూర్ వెళ్లి ఓ ఫ్లాట్‌లో దాక్కున్నారని తెలుసుకున్న పోలీసులు జైపూర్ వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులను నజాఫ్ గఢ్ కు చెందిన నగేష్ కుమార్, శివం, మనీష్ కుమార్ గా గుర్తించారు. వీరి నుంచి 6కిలోల270 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, ఇతర వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.6కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈఘటనలో మిగిలిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..