Adhar Card: వారి ఆధార్ కార్డులు ఏమవుతున్నాయి..? వెలుగులోకి విస్తుపోయే విషయాలు..
చనిపోయిన వారి ఆధార్ కార్డులు ఏమవుతున్నాయి..? ఈ కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయా..? లేక వేరే ఎవరైనా ఉపయోగిస్తున్నారా..? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. అయితే ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారంలో కీలక విషయాలు ఉన్నాయి. మరణాలు, ఆధార్ డీయాక్టివేట్ మధ్య ఉన్న తేడాలను ఇది బయటపెట్టింది.

ఆధార్ కార్డు.. ఇండియాలో నివసించాలంటే గుర్తింపు కోసం ఇది తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు రావాలన్నా, చివరకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయాలన్న ఆధార్ అవసరం. అయితే చనిపోయిన వారి ఆధార్ కార్డులు ఏమవుతున్నాయి. డీ యాక్టివేట్ అవుతున్నాయా..? లేక ఇంకా యాక్టివేట్‌లోనే ఉంటున్నాయా.? వాటిని ఇంకెవరైనా వాడుతున్నారా.? అంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు యూఐడీఏఐ కేవలం 1.15కోట్ల మంది ఆధార్ నెంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని వెల్లడైంది. ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. జూన్ 2025 నాటికి, మన దేశంలో 142.39 కోట్ల ఆధార్ హోల్డర్లు ఉన్నారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారం.. 2007 – 2019 మధ్య ప్రతి ఏటా సగటున 83.5 లక్షల మరణాలు ఉన్నట్లు చెబుతోంది. ఈ ఏడాది వరకు మరణాలు 11కోట్లు దాటినప్పటికీ.. ఆధార్ డీయాక్టివేట్ల సంఖ్య 1.15కోట్ల దగ్గరే ఉంది. యూఐడీఏఐ ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ చేయకపోతే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
డీయాక్టివేషన్ ప్రక్రియ క్లిష్టంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యులు అప్‌డేట్ చేయించడం వంటి వాటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. మరణించిన వ్యక్తి యొక్క ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే ప్రక్రియ భారత రిజిస్ట్రార్ జనరల్ మరణ రికార్డులను పంచుకోవడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని యూఐడీఏఐ ధృవీకరించింది. ఆర్జీఐ ఆధార్ నంబర్‌లతో పాటు మరణ రికార్డుల సమాచారాన్ని యూఐడీఏఐతో పంచుకున్నప్పుడు.. తాము నిర్ణీత ప్రక్రియ తర్వాత, మరణించిన వారి ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేస్తామని యూఐడీఏఐ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి.. ఆగస్టు 2023లో పౌర రిజిస్ట్రేషన్ సిస్టమ్ నుండి మరణ రికార్డుల ఆధారంగా డీయాక్టివేట్ చేసే విధానానికి మార్గదర్శకాలను జారీ చేశారు.
యూఐడీఏఐ ప్రతి ఏడాది డీయాక్టివేషన్‌లను ట్రాక్ చేయదు. అయితే ఆధార్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి 2024 వరకు ఆర్జీఐ నుండి అందుకున్న మరణాల డేటా ఆధారంగా డియాక్టివేట్ చేయబడిన మొత్తం ఆధార్ నంబర్ల సంఖ్య 1.14కోట్లు. అయితే ఆధార్ డీయాక్టివేట్ చేయకపోవడం వల్ల కొన్ని నష్టాలు నకిలీ ఓటర్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. డీయాక్టివేట్ చేయని ఆధార్ కార్డులను నకిలీ వ్యక్తులు ఉపయోగించే ఛాన్స్ ఉంది. ఇటీవల బీహార్‌లో నిర్వహించిన ఓటర్ సర్వేలోనూ ఇదే తేలింది. 100 శాతానికిమించి ఆధార్ కార్డులు ఉండడం చూసి అధికారులే అవాక్కయ్యారు. కాబట్టి యూఐడీఏఐ వెంటనే ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేస్తే.. ఇటువంటి సమస్యలు ఉండవు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




