Mohan Bhagwat: దేశ సేవకు ఎప్పుడూ సిద్ధమే.. రిటైర్ అవ్వాలని చెప్పలేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక కామెంట్స్
అఖండ భారత్ ప్రజల ఐక్యతకు సంబంధించినదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అంతేకాకుండా దేశం యొక్క ఐక్యత, అఖండ భారత్, ముస్లింలతో సంబంధాలు, రిజర్వేషన్లు, జనాభా నియంత్రణ, మతమార్పిడి, దేవాలయాలు వంటి వివిధ అంశాలపై భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో రిటైర్‌మెంట్ అనే భావన లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. సంఘ్ ప్రయాణం 100 సంవత్సరాలు – నయే క్షితిజ్’ అనే మూడు రోజుల ఉపన్యాస ముగింపు కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట వయస్సులో పదవీ విరమణ చేస్తానని లేదా ఎవరైనా పదవీ విరమణ చేయాలని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌లో మనమందరం స్వచ్ఛంద సేవకులం. నాకు 80 ఏళ్లు నిండినప్పుడు, ఒక శాఖను నిర్వహించే పని నాకు అప్పగిస్తే.. నేను దానిని చేయాల్సి ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్ మాకు అప్పగించిన పనిని మేము చేస్తాము. పదవీ విరమణ ప్రశ్న ఇక్కడ వర్తించదు. ఆర్‌ఎస్‌ఎస్ కేవలం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదు. ఈ బాధ్యతను స్వీకరించగల మరో 10 మంది ఇక్కడ ఉన్నారు. జీవితంలో ఏ సమయంలోనైనా పదవీ విరమణ చేయడానికి, ఆర్‌ఎస్‌ఎస్ కోరుకునేంత కాలం పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
అఖండ భారత్: ప్రజల ఐక్యత
భారతదేశం ఐక్యంగా ఉండటం ఒక ‘‘జీవన వాస్తవం’’ అని భగవత్ చెప్పారు. మన పూర్వీకులు, సంస్కృతి, మాతృభూమి మనల్ని ఏకం చేస్తాయని ఆయన ఉద్ఘాటించారు. అఖండ భారత్ కేవలం ఒక రాజకీయ భావన కాదని, అది ప్రజల ఐక్యతకు సంబంధించినదని ఆయన అన్నారు. సంఘ్‌కు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అందరి పూర్వీకులు, సంస్కృతి ఒకటేనని, పూజా పద్ధతులు వేరైనా గుర్తింపు మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు. అఖండ భారత్‌కు ముస్లింలు కలిసి కదిలితే తమ ఇస్లాం తుడిచి పెట్టుకుపోతుందనే భయాన్ని వదులుకోవాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు.
సంఘ్ పాత్ర: ఉద్యోగ ప్రదాతలుగా మారండి
సమాజానికి ఉద్యోగాల గురించి ప్రస్తావిస్తూ.. మనం ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. జీవనోపాధి అంటే కేవలం ఉద్యోగం అనే భ్రమను తొలగించాలని, ఇది సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందని, ఉద్యోగాలపై ఒత్తిడి తగ్గిస్తుందని అన్నారు. శ్రమకు గౌరవం ఇవ్వడం సమాజ పురోగతికి కీలకం అని ఆయన నొక్కి చెప్పారు.
మతమార్పిడులు, అక్రమ వలసలు
జనాభా నియంత్రణ అవసరాన్ని మోహన్ భగవత్ నొక్కి చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 2.1 జనన రేటును నిర్వహించడం జనాభాను స్థిరంగా ఉంచుతుందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో మతమార్పిడి, చొరబాట్లను వ్యతిరేకించారు. జనాభా మార్పు తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, ఇది దేశ విభజనకూ కారణం కావచ్చని అన్నారు. మతమార్పిడులు దురాశ లేదా బలవంతంగా జరగకూడదని, వాటిని అరికట్టాలని సూచించారు. అక్రమ వలసదారులకు బదులుగా మన దేశ ప్రజలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు.
ఉద్యమాల జోలికి వెళ్లం
రామాలయ ఉద్యమంలో సంఘ్ క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ, భవిష్యత్తులో ఏ ఇతర ఉద్యమాలలోనూ ప్రత్యక్షంగా పాల్గొనదని ఆయన స్పష్టం చేశారు. ‘‘రామాలయాన్ని నిర్మించాలనేది మా పట్టుదల. సంఘ్ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు సంఘ్ ఇతర ఉద్యమాలకు వెళ్లదు. అయితే కాశీ-మథుర-అయోధ్య హిందూ మనస్సులో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని.. వీటిపై హిందూ సమాజం పట్టుబట్టడం సహజమేనని ఆయన అన్నారు. రిజర్వేషన్లు తర్కానికి సంబంధించిన విషయం కాదని, కరుణకు సంబంధించినది ఆయన అన్నారు. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి రిజర్వేషన్లు అవసరమని, లబ్ధిదారులకు అవసరమైనంత కాలం సంఘ్ వారికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
మహిళల పాత్ర – దేవాలయాలు
భారతదేశంలోని అన్ని భాషలూ జాతీయ భాషలేనని, కానీ పరస్పర సంభాషణకు ఒక సామాన్య భాష అవసరమని ఆయన అన్నారు. అది విదేశీ భాష కాకూడదన్నారు. మాతృభాషను నేర్చుకోవడంతో పాటు రాష్ట్ర భాష, ఒక సామాన్య భారతీయ భాషను మాట్లాడగలగాలని సూచించారు. 1936లో ఏర్పడిన రాష్ట్రీయ సేవికా సమితి మహిళల సాధికారతకు కృషి చేస్తుందని.. పురుషులు, మహిళలు ఇద్దరూ సంఘ్ కార్యకలాపాల్లో సమానంగా ఉంటారని చెప్పారు. దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ కాకుండా భక్తులకే వాటిని అప్పగించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మోహన్ భగవత్ అన్నారు.
చివరగా భారత్ హిందూ దేశం అని ప్రకటించడానికి అధికారిక ప్రకటన అవసరం లేదని మోహన్ భగవత్ తెలిపారు. కానీ అధికారికంగా ప్రకటించడం ప్రభుత్వ బాధ్యత అని మోహన్ భగవత్ అన్నారు. దీనిని నమ్మడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.. నమ్మకపోవడం హానికరం’’ అని మోహన్ భగవత్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




