PM CARES Fund: కరోనాతో అనాథలైన చిన్నారులకు అండగా మోదీ సర్కారు..!
కరోనా మహమ్మారి ఓ పీడకలగా మిగిలింది. కోవిడ్-19 వైరస్ బారినపడి పలువురు మృతి చెందగా.. వారి పిల్లలు అనాథలుగా మారారు. వారి సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలకు అండగా నిలిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద 4500 మంది లబ్ధిపొందుతున్నారు.

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు మోదీ సర్కారు అండగా నిలిచింది. దాదాపు 4,500 మంది అనాథ చిన్నారుల సంక్షేమానికి పీఎం కేర్స్ ఫండ్ (PM CARES Fund) రూ.346 కోట్లు ఖర్చు చేసినట్లు 2022-23 సంవత్సరానికి సంబంధించిన తాజా ఆడిట్ నివేదిక వెల్లడించింది. 2020 మార్చి 11 నుంచి 2023 మే 5 వరకు కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచేందుకు 2021 మే 29న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అనాథ చిన్నారుల సంక్షేమంతో పాటు సరైన భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు సరైన విద్యా వసతులతో అనాథ చిన్నారులు తమ జీవితంలో సొంత కాళ్లపై నిలబడేలా ఊతమివ్వడం ఈ పథకం లక్ష్యం. అనాథ చిన్నారులకు 23 ఏళ్ల వయస్సు వరకు అండగా ఉంటూ అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తోంది.
తాజా గణాంకాల మేరకు ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా దాదాపు 4,500 మంది అనాథ చిన్నారులు లబ్ధిపొందున్నారు. దేశ వ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 558 జిల్లాలకు చెందిన చిన్నారులు ఈ పథకం కింద లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన 855 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి 467 మంది, మధ్యప్రదేశ్ నుంచి 433 మంది చిన్నారులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఇక దక్షిణ భారత్ నుంచి అత్యధికంగా తమిళనాడు నుంచి 426 మంది చిన్నారులు లబ్ధి పొందుతుండగా..ఆంధ్ర ప్రదేశ్ నుంచి 351 మంది లబ్ధిదారులుగా ఉన్నారు.
ఈ పథకం కింద ఒక్కో అనాథ చిన్నారికి తిండి, బస వసతులు, పునరావాసం కోసం రూ.10 లక్షల విలువైన ఆర్థిక సాయం కల్పిస్తున్నారు. చిన్నారులకు స్కూల్స్‌లో అడ్మీషన్, ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు, రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఒకటో తరగతి నుంచి 12 వరకు చదివే విద్యార్థులకు రూ.20,000 వరకు వార్షిక స్కాలర్‌షిప్ తదితర వసతులు కూడా కల్పిస్తున్నారు.
కరోనా మహమ్మారి ఓ పీడకలగా మాగిలిపోయింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయిన పలువరు చిన్నారులు అనాథలుగా మారారు. వారికి అండగా నిలిచేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం కేర్స్ పథకం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.




