Republic Day: రిపబ్లిక్ వేడుకలకు తుది మెరుగులు దిద్దకుంటున్న వేదిక.. తొలిసారిగా దర్యాప్తు సంస్థల శకట ప్రదర్శన
ఢిల్లీలోని రక్షణశాఖకు చెందిన రంగ్‌శాల మైదానంలో తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. శకటాలను రక్షణశాఖ సిబ్బంది మీడియాకు ప్రదర్శించారు. ఈ ఏడాది 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు శకటాల ప్రదర్శనకు ఎంపికైనట్టు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు
దేశ రాజధాని ఢిల్లీ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన రాజ్ పథ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలలో జరిగే పరేడ్ లో వివిధ శకటాల ప్రదర్శన ఉంటుంది. ఈ శకటాల ప్రదర్శన సాంప్రదాయం 1950 సంవత్సరం నుండి కొనసాగుతోంది. అవును రిపబ్లిక్ డే వేడుకలు అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది సైనిక బలగాల విన్యాసాలతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలే. ఈ ఏడాది జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాల ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంపికైంది.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనకు వివిధ రాష్ట్రాల శకటాలు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని రక్షణశాఖకు చెందిన రంగ్‌శాల మైదానంలో తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. శకటాలను రక్షణశాఖ సిబ్బంది మీడియాకు ప్రదర్శించారు. ఈ ఏడాది 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు శకటాల ప్రదర్శనకు ఎంపికైనట్టు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 6 కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఉంటాయని చెప్పారు. రక్షణశాఖకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు స్పెషల్ ఫోర్సెస్, పారామిలటరీ బలగాలు, ఇతర సాయుధ బలగాలు కూడా ప్రదర్శనలో భాగమవుతాయి.
అయితే ఈ ఏడాది తొలిసారిగా దర్యాప్తు సంస్థలకు కూడా అవకాశం కల్పించగా..’నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో శకటాల ప్రదర్శనకు ఎంపికైంది. ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోగా.. తెలంగాణ మాత్రం ఈ ఏడాది కనీసం దరఖాస్తు కూడా చేయలేదని తెలిసింది. కోనసీమలో జరిగే ‘ప్రభల తీర్థం’ థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని సిద్ధం చేస్తోంది. 450 ఏళ్లుగా కొనసాగుతున్న ‘ప్రభల తీర్థం’ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ శకటం ఉంది. ఆదిదంపతులు శివపార్వతుల ప్రతిరూపాలైన గరగలు, ప్రభలను కోనసీమ ప్రజలు కనుమ రోజున ఒక చోటకు తరలించడమే ప్రభల తీర్థం. అందుల్లో జగ్గన్నతోటలో జరిగే వేడుకలు మరింత ప్రత్యేకమైనవని కళాకారులు చెప్పారు. మరోవైపు భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్య మాదక ద్రవ్యాలు…వాటిపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవకాశం కల్పించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..