Phoolan Devi: కొందరికి సివంగి.. మరికొందరికి అమ్మోరు తల్లి.. నేడు బందిపోటు రాణి జయంతి

Phoolan Devi: బందిపోటు రాణి ఫూలన్ దేవి...కొంతమందికి మంచిది. మరికొందరికి కిరాతకరాలు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల.. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ పెరిగింది..

Phoolan Devi: కొందరికి సివంగి.. మరికొందరికి అమ్మోరు తల్లి.. నేడు బందిపోటు రాణి జయంతి
Phoolan Devi
Follow us
Surya Kala

|

Updated on: Aug 10, 2021 | 9:47 AM

Phoolan Devi: బందిపోటు రాణి ఫూలన్ దేవి…కొంతమందికి మంచిది. మరికొందరికి కిరాతకరాలు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల.. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ పెరిగింది. భారత దేశంలో పేరుగాంచిన పూలన్ దేవి జయంతి నేడు.  ఉత్తరప్రదేశ్‌లో యమునా నది తీరంలోని మారుమూలగ్రామమైన ‘గోర్ఖాకా పూర్వా’లో 1963 ఆగస్టు 10న ఫూలన్‌ దేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు, నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తిగల అత్యంత వెనకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. ఫూలన్ దేవి.. తల్లిదండ్రులకు అండగా నిలబడం కోసం చిన్నతనం నుంచి పశువులు మేపేది. యమునా నదితో ప్రత్యేక అనుబంధం ఉంది. పదవులు నడిపింది.. నదిలో చేప పిల్లలా ఈదింది. బతకడం కోసం బరువులు మోసింది.. పొలం పనులు చేసింది.

భూమి, సంపద, అధికారం కలిగి అగ్రకుల ఠాకూర్ల దర్పాలనూ, దాష్టీకాలనూ చూసింది. చమార్‌, జాతవ్‌, మల్లా మొదలగు అణగారిన కులాల దైన్యాన్నీ, అశక్తతలనూ అర్థం చేసుకుంది. తండ్రి కున్న కొద్దిపాటి ఆస్తినీ కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్న నాడే ప్రశ్నించి దెబ్బలు తిన్నది. 11 ఏళ్ల వయసులోనే 35 ఏళ్ల వయసున్న వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. భర్త లైంగిక హింసలకు గురైంది.

1981లో ఫూలన్ దేవిపై ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు బందిపోటు దొంగలు లాలా రామ్, శ్రీరామ్‌లు అత్యాచారం చేశారు. ఇందుకు ప్రతీకారంగా ఫూలన్ దేవీ వారి సామాజిక వర్గానికి చెందిన 20 మంది ఠాకూర్లను ఊచకోత కోసినట్లు ఆరోపణలు వినిపించాయి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ.. అడవుల్లో చంబల్‌ లోయల్లో ఒంటరిగా నడిచింది. జంతువులతో సహజీవనం చేసింది. పేరుకు బందిపోటుగా మారినా బాధితులకు, పేదలకు ఆర్థిక సాయం చేసి, బతకడానికి ధైర్యాన్ని ఇచ్చింది.

మగ, కుల దురహంకార ఠాకూర్లకేగాక, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికీ ఫూలన్‌ దేవి పెద్ద సవాలుగా మారింది. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, అర్జున్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వమూ ఫూలన్‌దేవితో చర్చలకు ముందుకొచ్చాయి. దీంతో 1983లో మధ్యప్రదేశ్ పోలీసులకు లొంగిపోయి ఫూలన్ దేవి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఊచకోత జరిగిన రెండేళ్ల తర్వాత ఫూలన్ దేవి మధ్యప్రదేశ్ పోలీసులకు క్షమాభిక్ష పథకం కింద లొంగిపోయింది. ఉత్తర్ ప్రదేశ్‌ జైలుకు కాకుండా ఫూలన్ దేవి విన్నపం మేరకు గ్వాలియర్ జైలులో ఉంది. దాదాపు 11 ఏళ్లు గ్వాలియర్ , జబల్ పూర్ జైలులో ఉంది ఫూలన్ దేవి. విచారణ ఎదుర్కోకుండానే 1994లో విడుదల అయ్యింది.

తర్వాత ఫూలన్‌ దేవి 34వ ఏట 1998లో ఉత్తప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీ నుంచి పార్లమెంటు సభ్యరాలిగా ఎన్నికైంది. పూలన్ దేవి 37వ ఏట దేశ రాజధాని ఢిల్లీలో హత్యకు గురయ్యింది. 2001 జూలై 25న ఫూలన్ దేవి ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. దీనికి కారణం ఫూలన్ దేవి ఠాగూర్లను చంపినందుకు ప్రతీకార హత్యఅని అంటారు. నిరుపేద కుటుంబంలో పుట్టి.. బందిపోటు దొంగగా..పేదల పాటి దేవతగా.. పార్లమెంట్ మెంబర్ గా నిజజీవితంలో విభిన్న పాత్రలను పోషించిన ఫూలన్ దేవి జీవితం.. కత్తి పెట్టినవారు ఆ కత్తికే బలి అవుతారు అనడానికి సజీవ సాక్ష్యం. ఇక ఫూలన్ జీవిత చరిత్ర పుస్తకాగానే కాదు.. బాలీవుడ్ లో సినిమాగా కూడా తెరకెక్కింది.

Also Read:  క్యాన్సర్, షుగర్, బీపీ ఉన్నవారికి దేవుడిచ్చిన వరం.. బిళ్ళ గన్నేరు.. దీనిలో ఔషధగుణాలు తెలిస్తే వదలరుగా