ఇండియన్‌ సిల్వర్‌స్క్రీన్‌ తొలి సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా

తనే గొప్పవాడననే భావన మనిషిని ఎంతగా దిగజారుస్తుందో.. ఎంతటి పతనానికి దారి తీస్తుందో తెలుసుకోవడం కోసమైనా రాజేశ్‌ఖన్నాను గుర్తుకు తెచ్చుకోవాలి

ఇండియన్‌ సిల్వర్‌స్క్రీన్‌ తొలి సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా
Follow us
Balu

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2020 | 3:56 PM

వస్తూ వస్తూ విజయం అందలాన్ని అందిస్తుంది. పోతూ పోతూ అధ: పాతాళానికి నెట్టేస్తుంది. ఇది రాజేష్‌ఖన్నాకు సరిగ్గా సరిపోతుంది. ఎంత త్వరగా శిఖరాగ్రాన్ని చేరుకున్నాడో అంతే త్వరగా నేలకు జారాడు. ఇప్పుడాయన ప్రస్తావన ఎందుకన్న డౌట్‌ రావచ్చు.. ఇవాళ ఆయన వర్ధంతి.. నిజానికి ఈ రోజున ఆయన గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకొవాలి.. కాకపోతే తనే గొప్పవాడననే భావన మనిషిని ఎంతగా దిగజారుస్తుందో.. ఎంతటి పతనానికి దారి తీస్తుందో తెలుసుకోవడం కోసమైనా రాజేశ్‌ఖన్నాను గుర్తుకు తెచ్చుకోవాలి.. సూపర్‌స్టార్‌.. రాజేశ్‌ఖన్నాకు అచ్చంగా సరిపోయే విశేషణం.. తెరంగ్రేటం చేసిన మూడేళ్లకే ఈ హోదాను సంపాదించాడంటేనే ఆయనెంత ఘనాపాటో అర్థమవుతుంది.. భారతీయ సినిమా చరిత్రలో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నటుడు ఇతడొక్కడే.. ఒకే ఒక్కడే!

కొత్త నిర్మాతల గుప్పిట్లో ప్రముఖ హీరోలు

హిందీ సినిమా తొలినాళ్లలో బాలీవుడ్డంతా స్టూడియోల కంట్రోల్‌లోనే ఉండేది.. నటీనటులు, టెక్నిషీయన్లు, సినిమారంగానికి చెందిన సమస్త జీవులకు స్టూడియోలే జీవనాధారం.. రెండో ప్రపంచయుద్ధం తర్వాత పరిస్థితి మారింది.. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టుల్లో సంచీలకు సంచీలు డబ్బు కూడబెట్టిన వారంతా రంగుల ప్రపంచంవైపు ఓ చూపు చూశారు.. అలా సినిమా పరిశ్రమ ఓ బిజినెస్‌గా మారింది.. నల్లడబ్బును కుప్పలు తెప్పలుగా పోసి సినిమాలు తీయడం మొదలు పెట్టారు.. ఈ దెబ్బకు అప్పటివరకు కళకళలాడిన మినర్వా, బాంబే, రంజిత్‌, మూవీటోన్‌ వంటి సంస్థలు ప్రాభావాన్ని కోల్పోయాయి.. కొన్ని మూతపడ్డాయి.. మరి వాటినే నమ్ముకున్న తారలు ఏదో దారి వెతుక్కోవాలి కదా! ఆ విధంగా వారంతా కొత్త నిర్మాతల గుప్పిట్లో చిక్కారు.. భారీగా పారితోషికాలు ముట్టచెబితే ఎవరు మాత్రం చిక్కరు? రాజ్‌కపూర్‌, దిలీప్‌కుమార్‌, దేవానంద్‌, రాజ్‌కుమార్‌.. ఇలాంటి వారంతా అలా పైకొచ్చినవారే! అయితే ఎవరు కూడా సూపర్‌స్టార్‌ హోదాను దక్కించుకోలేదు.. కారణం అప్పటి ప్రేక్షకులు అందరిని సమానంగా చూడటమే! ఏ ఒక్కరిపైనా అభిమానాన్ని పెంచుకోకపోవడమే! ఏడో దశకంలో పరిస్థితి మారింది. మారిందనడం కంటే రాజేష్‌ఖన్నానే మార్చడంటే బాగుంటుంది..

వేషాల కోసం కారులో స్టూడియోలో చుట్టు తిరిగిన ఒకే ఒక్కడు

రాజేష్‌ఖన్నా అసలు పేరు జతిన్‌ఖన్నా.. అమృత్‌సర్‌లో పుట్టాడు. చిన్నప్పుడే కలిగినవారింటికి దత్తు వెళ్లాడు. అందుకే బాల్యమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. కాలేజీకొచ్చాక సినిమాలపై ఆసక్తి పెరిగింది. అంతే బొంబాయి చేరాడు. స్టూడియోల చుట్టు తిరగడం అలవాటు చేసుకున్నాడు. స్టేజ్‌ ఫియర్‌ పోవడానికి నాటకాలు వేశాడు. ఎంజి స్పోర్ట్స్‌ కారులో సినిమా కంపెనీల చుట్టు తిరిగిన వర్ధమాన నటుడు రాజేష్‌ఖన్నా ఒక్కడే. అప్పట్లో కొత్త తారలను పరియం చేయడానికి యునైటెడ్‌ ప్రొడ్యూసర్స్‌ టాలెంట్‌ ఓ పరీక్ష నిర్వహించింది. అందులో రాజేష్‌ ఖన్నా ఫస్టు వచ్చాడు. 1966లో చేతన్‌ ఆనంద్‌ తీసిన ఆఖ్రీ ఖత్‌తో జతిన్‌ ఖన్నా కాస్త రాజేష్‌ ఖన్నాగా మారాడు. దురదృష్టమేమిటంటే ఆ సినిమా ఫ్లాప్‌ కావడం.. తర్వాతి ఏడాది వచ్చిన దాస్‌, బహోరోంకే స్వప్నే కూడా పరాజయం చెందాయి. అదృష్టమేమిటంటే ఈ సినిమాలు తీసిన వాళ్లంతా పెద్ద నిర్మాతలు కావడం. అయినా రాజేష్‌ ఖన్నాకు అదృష్టం కలిసిరాలేదు. తర్వాత వచ్చిన ఔరత్‌, ఖామోషీ, బద్‌నామ్‌, ఫరిస్తే, డోలి, బంధన్‌ అన్నీ పరాజయాలే! ఆశ్చర్యమేమిటంటే ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా రాజేష్‌కు సినిమా ఛాన్సులు రావడం. 1969లో శక్తి సామంత ఆరాధన రిలీజైంది. ఆ సినిమాతో రాజేష్‌ ఖన్నా స్టారయ్యాడు. యువతకుఆరాధ్య నాయకుడయ్యాడు.

హిట్ల మీద హిట్లు కొట్టిన స్టార్‌ నవంబర్‌లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్‌లో దో రాస్తే విడుదలైంది. బొంబాయిలో పక్క పక్కనే వుండే ఓపెరా హౌజ్‌, రాక్సీ థియేటర్లలో ఈ రెండు సినిమాలు గోల్డెన్‌ జూబ్లీలు జరుపుకున్నాయి. మిగతా చోట్ల సిల్వర్‌ జూబ్లీలు కొట్టాయి. స్టార్‌ కాస్తా సూపర్‌స్టారయ్యాడు. కళ్లను తిప్పడం, కొంటెగా ఆదాబ్‌ చెప్పడం, తమాషాగా తలాడించడం వంటి మేనరిజాలు యువతుల్లో క్రేజ్‌ను తీసుకొచ్చాయి. కాలేజీలు డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడమనేది రాజేష్‌ ఖన్నా సినిమాలతోనే మొదలైంది. రాజేష్‌ అంటే అమ్మాయిలు పిచ్చి అభిమానాన్ని పెంచుకున్నారు. ఎంతగా అంటే.. ఓ రోజు ప్రేక్షకులతో సినిమా చూడటానికి వచ్చాడని ఎలా తెలిసిందో ఏమో కానీ వేలాది మంది అభిమానులు రాజేష్‌ చుట్టూ మూగారు. అమ్మాయిలైతే అతని కారుకు పట్టిన దుమ్ము తీసి నుదుటన విభూతిలా పెట్టుకున్నారు. కారుకు లెక్కకు మంచిన లిప్‌స్టిక్‌ మరకలు అంటుకునేవి. ఆడపిల్లల కలల్లో రాజేష్‌ తప్ప మరోకరు కనిపించేవారు కాదు. దో రాస్తే తర్వాత వరుసగా పదకొండు సినిమాలు జూబ్లీల మీద జూబ్లీలయ్యాయి. విజయం కిక్కునిచ్చింది. దాంతోపాటే నిక్కును తెచ్చింది. చుట్టు భజనపరులు చేరారు. ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం మొదలు పెట్టారు. పొడగ్తలతో ముంచెత్త సాగారు. వారి మాటలు రాజేష్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. గర్వం మరింత పెరిగింది. 1971లో అందాజ్‌ వచ్చింది. హీరో హీరోయిన్లు షమ్మీ కపూర్‌, హేమామాలిని. సినిమా గోల్డెన్‌ జూబ్లీ జరుపుకుంది. కారణం అందులో కేవలం పదిహేను నిమిషాల పాటు కనిపించే రాజేష్‌ ఖన్నానే. జిందగీ ఎక్‌ సఫర్‌… హై సుహానా…. అంటూ మోటార్‌ బైక్‌పై రాజేష్‌ పాడిన పాట అమ్మాయిలకు నిద్రపట్టకుండా చేసింది.

అందరిని వెనక్కి నెట్టిన దూసుకెళ్లిన రాజేష్‌ఖన్నా

రాజేష్‌ ఖన్నా ధాటికి రాజ్‌ కపూర్‌, దిలీప్‌ కుమార్‌, దేవానంద్‌ పక్కకెళ్లారు. అప్పుడప్పుడే హీరో అయిన జితేంద్ర వెనక్కిపోయాడు. ఆనంద్‌, సఫర్‌, అమర్‌ప్రేమ్‌ సినిమాలు రాజేష్‌ను ట్రాజెడీ కింగ్‌ చేశాయి. అప్పటి వరకు అదే ముద్రతో ఫీల్డ్‌ను ఏలిన దిలీప్‌కుమార్‌కు ఛాన్స్‌లు లేకుండాపోయాయి. ఎవర్‌గ్రీన్‌ హీరో దేవానంద్‌ కూడా పోటీ పడలేకపోయాడు. హాథీ మేరా సాధీ సినిమా ఏకంగా రాజేష్‌ ఖన్నాను దేవుణ్ని చేసి పారేసింది. ఆ సినిమాలో అనారోగ్యం బారిన పడిన ఓ ఏనుగు రాజేష్‌ చేయి తగలగానే కోలుకుంటుంది. అంతే అక్కడ్నుంచి రాజేష్‌ ఇంటికి తండోపతండాలుగా జనాలు రావడం మొదలైంది. పిల్లల్ని చంకనెత్తుకుని తల్లిదండ్రులు రావడం ఎక్కువైంది. దాంతో రాజేష్‌ఖన్నా నివాసమైన ఆశీర్వాద్‌ దగ్గర పోలీసులను పెట్టాల్సి వచ్చింది. అభిమానులు పెరిగారు. ఇండస్ట్రీ సలాం చెప్పింది. నిర్మాతలు గులాంలయ్యారు. పొగరు తలకెక్కింది. అహం పెరిగింది. తననంతవాడు లేడనే గర్వమూ వచ్చింది. ఈ సుగుణాలన్ని అబ్బడంతో రాజేష్‌ చెలరేగాడు. ఉదయం కాల్‌షీటుకు మధ్యాహ్నం వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. అతని కోసం సీనియర్‌ తారలంతా ఎదురుచూడాల్సి వచ్చేది. దగ్గరివాళ్లు చనువు తీసుకుని ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే చుట్టు ఉన్న భజనపరులు చెప్పనిచ్చేవారు కాదు. దర్శకులు దూరమ్యారు. నిర్మాతలు భయపడటం మొదలు పెట్టారు. 1972లో పతనం ప్రారంభమైంది. సినిమాలన్నీ వరుసపెట్టి ఫట్‌ మన్నాయి. అప్పట్లో రాజేష్‌ఖన్నా గర్ల్‌ ఫ్రెండ్‌ అంజు మహేంద్రు. పాపం ఆ నెపమంతా ఆమెపై పడింది. రాజేష్‌ ఖన్నా ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్నాడు కూడా. తర్వాత ఆమె అంజాద్‌ ఖాన్‌ సొదరుడు ఇంతియాజ్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది.

జంజీర్‌తో ఓవర్‌నైట్‌ స్టారైన అమితాబ్‌

తర్వాతి సంవత్సరం బాబీ హీరోయిన్‌ డింపుల్‌ కపాడియాను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెతో కూడా తెగతెంపులు చేసుకున్నాడు,. ఏడో దశకం మొదట్లో దేశంలో సరికొత్త పరిస్థితులు వచ్చాయి. అవినీతి పెరిగింది. ఉద్యోగాలు దొరక్క యువత ఫస్ట్రేషన్‌తో వుండేది. సరిగా ఆ సమయంలోనే వాళ్లకు కావాల్సిన హీరో దొరికాడు. అతనే అమితాబ్‌ బచ్చన్‌. జంజీర్‌ సినిమాతో అమితాబ్‌ ఓవర్‌నైట్‌ స్టారయ్యాడు. నిజానికి జంజీర్‌ సినిమాను రాజేష్‌ఖన్నాతోనే తీయాలనుకున్నాడు ప్రకాశ్‌ మెహ్రా.. రాజేష్‌ కాదన్నాకే అమితాబ్‌ను అప్రోచ్‌ అయ్యాడు.. అలా పరోక్షంగా తన సూపర్‌స్టార్‌ హోదాను అమితాబ్‌కు కట్టబెట్టుకున్నాడు రాజేష్‌.. దీవార్‌ సినిమాతో రాజేష్‌ఖన్నా స్థానానికి ఎసరు పెట్టేశాడు అమితాబ్‌. తర్వాతి కాలంలో అమితాబ్‌ నంబర్‌వన్‌ హీరో అయ్యాడు.

కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందలేకపోయాడు

రాజేష్‌ఖన్నాకు సూటయ్యే పాత్రలు దొరకడం కష్టమైపోయింది. రాజ్‌కపూర్‌ సత్యంశివంసుందరం సినిమాను రాజేష్‌తో తీయాలనుకున్నాడు.. కానీ అప్పటికే రాజేష్‌ పొగరుబోతుతనం నలుగురికి తెలిసిపోయింది.. దాంతో ఆ సినిమా శశికపూర్‌కు వెళ్లింది.. అనిల్‌కపూర్‌ను పెద్ద స్టార్‌ను చేసిన మిస్టర్‌ ఇండియాను అహంకారంతో రాజేష్‌ వదలుకున్నాడు. ఎనిమిదో దశకం మొదట్లో థోడిసీ బేవఫాయి, అమర్‌దీప్‌, అగర్‌ తుమ్‌ న హోతే, అవతార్‌, సౌతెన్‌ వంటి సినిమాలు సూపర్‌ హిట్టయినా.. చాలా సినిమాలు హిట్టు కొట్టినా కోల్పోయిన వైభవం మాత్రం తిరిగి రాలేదు. ఈ సమయంలోనే టినా మునిమ్‌కు దగ్గరయ్యాడు. తర్వాత ఆమె తనంతటతానుగా దూరమయ్యింది. సినిమాలు తగ్గాయి. ఫ్యాన్సూ తగ్గారు.. ఒంటరితనం ఆవరించింది. ఈ దశలో పాలిటిక్స్‌లో ఎంటరయ్యాడు. అక్కడా పెద్దగా రాణించలేకపోయాడు. మధ్యలో ఓ రెండు మూడు సినిమాలు, ఓ టీవీ సీరియల్‌ చేశాడు. భారతదేశపు మొట్టమొదటి సూపర్‌స్టార్ అయిన రాజేష్‌ఖన్నా చేజేతులా తన హోదాను కోల్పోయాడు.. అందుకే అంటారు చేసుకున్నవారికి చేసుకున్నంత అని! ఏదిఏమైనా రాజేష్‌ఖన్నా మాత్రం బాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌… ఓ హ్యాండ్సమ్‌ ఫిగర్‌…