Indian Railways: సంక్రాంతి వేళ రైల్వేశాఖ సంచలన నిర్ణయం.. షెడ్యూల్స్‌లో భారీ మార్పులు.. మీరు వెళ్లే రైలు ఒకసారి చెక్ చేస్కోండి
భారత్‌లో రైళ్ల వేగం మరింత పెరగనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ట్రైన్ల వేగంలో మార్పులకు భారతీయ రైల్వే నాంది పలికింది. శనివారం నుంచి అనేక రైళ్ల వేగాన్ని పెంచింది. దీని వల్ల ప్రయాణికులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.

Trains New Schedule: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు ఊరటనిచ్చే మరో నిర్ణయం ఇండియన్ రైల్వే తీసుకుంది. రైళ్ల దూరం, వేగాన్ని మరింత పెంచింది. ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కొత్త టైమ్ టేబుల్ ఆఫ్ ట్రైన్స్-2026ను రైల్వేశాఖ ప్రకటించింది. దీని ప్రకారం రైళ్ల వేగాన్ని మరింతగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. రైళ్ల రాకపోకలు, సర్వీసులు పొడిగింపు, సూపర్ ఫాస్ట్‌గా మార్చడం, ట్రిప్పులను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంది. దీని వల్ల ప్రయాణం సమయం తగ్గి ప్రయాణికులకు లాభం జరగనుంది.
దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లు
దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. ఇక ఇప్పటికే ఉన్న 549 రైళ్ల వేగాన్ని పెంచారు. ఇక 86 రైళ్లను పొడిగించడంతో పాటు 10 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక 8 రైళ్ల ట్రిప్పుల సంఖ్యను మరింత పెంచారు. ఈ నిర్ణయాలు శనివారం నుంచే అమల్లోకి తెస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా నేటి నుంచి చాలా రైళ్ల వేగం మరింత పెరగనుంది. విజయవాడ డివిజన్‌లో విజయవాడ-కాకినాడ(17257), బెంగళూరు-కాకినాడ(17209), తిరుపతి-పూరి(17479/17480), విజయవాడ-గూడురు(17260), విజయవాడ-నెల్లూరు(17259), కాకినాడ-విశాఖపట్నం(17267), చెన్నై-హౌరా(12742), పాండిచ్చేరి-కాకినాడ(17656) రైళ్లతో పాటు హౌరా-కన్యాకుమారి(12665), హౌరా-మైసూర్(22817), విశాఖపట్నం-కొల్లాం(18567), పూరి-చెన్నై(22859) రైళ్ల వేగం పెరగనుంది.
30 నిమిషాల ముందుగానే..
రైళ్ల వేగం పెంపు వల్ల 105 రైళ్లు 30 నిమిషాల ముందుగానే గమ్యస్థానానికి చేరుకోనున్నాయి. ఇక 376 రైళ్లు 15 నిమిషాల ముందుగానే, 48 రైళ్లు 59 నిమిషాల ముందుగానే గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఇక మరో 20 రైళ్లు గంట కంటే ముందుగానే చేరుకునేలా షెడ్యూల్ సవరించారు. ప్రయాణికులు కొత్త రైళ్ల షెడ్యూల్స్ వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక రైల్వే విచారణ కేంద్రాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇక నైరుతి రైల్వేలో 117, నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 89, వెస్ట్రన్ రైల్వేలో 80, సదరన్ రైల్వేలో 75 రైళ్ల వేగం పెరిగింది. ఇలా అన్ని రైల్వే జోన్లలో ట్రైన్ల వేగాన్ని పెంచారు.
