మహారాష్ట్ర కొత్త స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్.. అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేల ఈడీ.. ఈడీ నినాదాలు

అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు జరిగిన ఓటింగ్‌లో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొని ఓటు వేశారు. సమాజ్‌వాది పార్టీ, ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

మహారాష్ట్ర కొత్త స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్.. అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేల ఈడీ.. ఈడీ నినాదాలు
Rahul Narvekar of BJP elected Maharashtra Assembly Speaker
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 03, 2022 | 12:47 PM

మహారాష్ట్ర అసెంబ్లీలో పైచేయి తమదేనని ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం, బీజేపీ చాటిచెప్పాయి. మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా షిండే వర్గం, బీజేపీ తరఫు అభ్యర్థి రాహుల్ నర్వేకర్‌‌ విజయం సాధించారు. అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అయిన రాహుల్ నర్వేకర్‌కు 164 ఓట్లు దక్కాయి. విపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) తరఫున స్పీకర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఉద్ధవ్ థాకరే‌కి అత్యంత సన్నిహితుడైన శివసేన ఎమ్మెల్యే రంజన్ సాల్వికి కేవలం 20 ఓట్లు మాత్రమే దక్కాయి. అసెంబ్లీలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఈడీ.. ఈడీ అంటూ నినాదాలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుని విపక్ష ఎమ్మెల్యేలను లొంగదీసుకుందని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఆరోపిస్తుండటం తెలిసిందే. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు జరిగిన ఓటింగ్‌లో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొని ఓటు వేశారు. సమాజ్‌వాది పార్టీ, ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

అంతకు ముందు సీఎం ఏక్‌నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ముంబైలోని హోటల్ ట్రైడెంట్ నుంచి బస్సులో బయలుదేరి రాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్నారు. షిండే వర్గం తిరుగుబాటుతో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమి సర్కారు కూలిపోవడం తెలిసిందే. శివసేన రెబల్ వర్గం, బీజేపీ కలిసి అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికాగా.. దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎం అయ్యారు. బల నిరూపణ కోసం షిండే – ఫడ్నవిస్ సర్కారు రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌ను నిర్వహిస్తోంది. ఇవాళ స్పీకర్ ఎన్నిక నిర్వహించగా.. రేపు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నిర్వహించనున్నారు. స్పీకర్ ఎన్నికలో విజయం సాధించడంతో అసెంబ్లీలో తమకు స్పష్టమైన మెజార్టీ ఉందని షిండే-బీజేపీ చాటిచెప్పింది.

స్పీకర్ ఎన్నికలో రాహుల్ నర్వేకర్‌‌‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ శివసేన విప్ జారీ చేసింది. విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన షిండే వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని ఆ పార్టీకి చెందిన డిప్యూటీ స్పీకర్ తెలిపారు.