అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్ ఘటనలో రాజకీయ కుట్ర దాగుందంటున్న మమతా బెనర్జీ.. శరద్ పవార్ రియాక్షన్ ఇదే!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం ప్రమాదమా.. పొలిటికల్ కుట్ర దాగుందా ? పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు వెనుక రీజన్ ఏంటి? అజిత్ మృతిపై కుటుంబసభ్యుల మాటేంటి..? ప్రమాదంపై DGCA చెప్పినదేంటి..? అసలు ఫ్లైట్ క్రాష్ VSR సంస్థ ఇస్తున్న క్లారిటీ ఏంటి ? ప్రజా నాయకుడి మృతితో ప్రజల రియాక్షనేంటి ?

మహారాష్ట్ర బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్ దుర్ఘటన అందరినీ కలచివేసింది. ఇప్పుడిప్పుడే అసలేం జరిగిందన్న విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అజిత్ పవార్ మృతదేహాన్ని గుర్తించిన వెంటనే మహారాష్ట్ర అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. ముంబై, పుణె, బారామతి సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ భవనాల ముందు, అజిత్ పవార్ ఫోటోలతో ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ ఘటనపై DGCA విచారణ చేస్తోంది. విమానం టేకాఫ్ అయిన క్షణం నుంచి చివరి సిగ్నల్ వరకూ.. మొత్తం డేటాను సేకరించింది. బ్లాక్ బాక్స్‌ను ప్రత్యేక బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఫ్లైట్ రూట్, వాతావరణ పరిస్థితులు, పైలట్ కమ్యూనికేషన్, ATC అనుమతులు ఇలా ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్లు DGCA వర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా సాంకేతిక లోపంతోనే అజిత్ పవార్ విమాన ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బారామతి ఎయిర్‌పోర్టుకు చేరక ముందే విమానం కుప్పకూలింది. రన్‌వేకు వంద అడుగులకు ముందే విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది.
చివరిసారిగా ఫ్లైట్ రాడార్‌లో కనిపించిన సమయంలో కూడా ఎత్తు, దిశ పరంగా అసాధారణ మార్పులు నమోదు కాలేదని తెలుస్తోంది. అయితే తర్వాత కొన్ని సెకన్లలోనే ఫ్లైట్ రాడార్ సిగ్నల్ పూర్తిగా కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ క్షణాల్లో ఫ్లైట్‌లో ఏం జరిగిందన్నది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. ఇంజిన్ ఫెయిల్యూరా, కంట్రోల్ లాస్‌నా, మెకానికల్ సమస్యనా, లేక మరేదైనా కారణమా అన్నదీ తెలియాల్సి ఉంది. మరోవైపు “విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని VSRవెంచర్ గ్రూప్ స్పష్టం చేస్తోంది.
అయితే ఫ్లైట్ క్రాష్ పై రాజకీయంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ప్రమాదమని నమ్మడానికి వీల్లేదని, మహాయుతి నుంచి బయటకు రావాలని అజిత్ పవార్ యోచిస్తున్న సమయంలోనే జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ కోణాల్లో ఎంక్వైరీ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు పవార్ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. అజిత్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అని శరద్‌పవార్ అన్నారు. అయితే మమతా బెనర్జీ చేసిన కుట్ర వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే. ఇందులో ఎలాంటి కుట్ర లేదు. దయచేసి అజిత్ పవార్ మరణాన్ని రాజకీయం చేయవద్దని శరద్ పవార్ స్పష్టం చేశారు.
మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తోపాటు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. మహారాష్ట్ర ఒక మహా నాయకుడిని కోల్పోయిందని కేంద్ర మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేతలంతా రాజకీయ భేదాలను పక్కనపెట్టి, అజిత్ పవార్ సేవలను గుర్తు చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
