AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMPV Virus Cases: గత ఏడాదే మా ఆస్పత్రిలో 17 కేసులు నమోదయ్యాయి.. డాక్టర్ షాకింగ్ కామెంట్స్

దేశ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న HMPV వైరస్ కేసులు పలు రాష్ట్రాల్లో 11 వరకు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో పూణెకు చెందిన ఓ ఆస్పత్రి వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కొత్త వైరస్ కేసులు దేశంలోకి కొత్తగా ఏమీ ఎంట్రీ ఇవ్వలేదని, గత ఏడాది డిసెంబర్ లో తమ ఆస్పత్రిలో 17 మందికి ఈ వైరస్ సోకినట్లు తెలిపారు. అయితే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందకపోవడం విశేషమన్నారు..

HMPV Virus Cases: గత ఏడాదే మా ఆస్పత్రిలో 17 కేసులు నమోదయ్యాయి.. డాక్టర్ షాకింగ్ కామెంట్స్
HMPV Virus Cases
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 09, 2025 | 1:31 PM

పూణె, జనవరి 9: హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వైరస్‌ కేసులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్‌ కొత్తదేమీ కాదని గత ఏడాది డిసెంబర్లో 17 HMPV కేసులు నమోదయ్యాయని మహారాష్ట్రంలోని పూణెలోని ప్రభుత్వ సాసూన్ హాస్పిటల్‌కు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె తెలిపారు. ఇదే విషయాన్ని మెడికల్ సూపరింటెండెంట్‌డాక్టర్ యల్లప్ప జాదవ్ కూడా ధృవీకరించారు. తమ ఆస్పత్రిలో 17 కేసులు ఉన్నాయని, వాటిల్లో ఎక్కువ శాతం పీడియాట్రిక్ కేసులేనని అన్నారు. అందువల్ల ఈ కేసులను ఎలా పరిష్కరించాలో, ఎలా చికిత్స అందిచాలో తమకు తెలుసని, ఎప్పటిలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

HMPV వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతీయ ఆదేశాల మధ్య పూణే జిల్లా కలెక్టర్ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సాసూన్ హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు. బుధవారం జరిగిన ఈ సమావేశానికి బారామతి సహా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, సివిల్‌ ఆసుపత్రుల నుంచి వైద్యులు హాజరయ్యారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని, కేసులను పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అయితే HMPV నిర్ధారణ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవని, ఒక్క పరీక్షకు రూ.17 వేల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. తమ హాస్పిటల్‌ జాతీయ ఇన్‌స్టిట్యూట్ అయినందున కేసుల భారాన్ని స్వీకరించమని NIVని అభ్యర్థిస్తామన్నారు. NIV ఇలాంటి జాతీయ/అంతర్జాతీయ హెల్త్‌ ఎమర్జెన్సీ సమయాల్లో సాయం చేసేందుకు వారు ఎల్లప్పుడు ముందుకు వస్తారని అన్నారు. ఇప్పుడు కూడా కేసులను ట్రాక్ చేయడానికి, పర్యవేక్షించడానికి, నిఘాను సులభతరం చేయడానికి వారి సహాయం తీసుకుంటామని వెల్లడించారు.

దీనిపై జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడిని మాట్లాడుతూ.. HMPV వైరస్‌ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఇది కొత్తదేమీ కాదని గతేడాది కూడా 17 కేసులు నమోదైనప్పటికీ వ్యాప్తి విసృతంగా కాకుండా కట్టడిలోనే ఉంది. అందువల్ల వైరస్‌ పూర్తి స్థాయి మహమ్మారిగా మారే ఛాన్స్‌ చాలా తక్కువని అన్నారు. కాబట్టి ఎలాంటి భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదన్నారు. కాగా ప్రస్తుతం దేశంలో HMPV కేసుల సంఖ్య 11కి పెరిగాయి. బెంగళూరులో రెండు, గుజరాత్‌లో ఒకటి, చెన్నైలో రెండు, కోల్‌కతాలో మూడు, నాగ్‌పూర్‌లో రెండు, ముంబైలో ఒకటి చొప్పున నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.