President of India: ఆ రాష్ట్రాల్లో భారీ క్రాస్ ఓటింగ్.. ఏపీలో వందశాతం ఓట్లు.. ముర్ము భారీ మెజార్టీకి కారణాలివే
Droupadi Murmu: ప్రథమ పీఠంపై గిరిజన బిడ్డ విజయం ఊహించిందే. కానీ మెజార్టీ ఎంతన్నదే అందరి దృష్టిని ఆకర్షించింది. విపక్షాలు యశ్వంత్ సిన్హా (Yashwant Sinha)ను అభ్యర్థిగా నిలబెట్టినా.. వేర్వేరు పార్టీల సభ్యులు మాత్రం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కే ఓట్లేశారు.
Droupadi Murmu: ప్రథమ పీఠంపై గిరిజన బిడ్డ విజయం ఊహించిందే. కానీ మెజార్టీ ఎంతన్నదే అందరి దృష్టిని ఆకర్షించింది. విపక్షాలు యశ్వంత్ సిన్హా (Yashwant Sinha)ను అభ్యర్థిగా నిలబెట్టినా.. వేర్వేరు పార్టీల సభ్యులు మాత్రం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కే ఓట్లేశారు. క్రాస్ ఓటింగ్‌తో అంతకుమించి అనేలా విక్టరీ కొట్టి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ద్రౌపది ముర్ము. అసలు ఓటింగ్ పర్సంటేజీ ఎంత? ఏయే రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది? అన్న విషయాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి 4,809 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,824 మంది ముర్ముకు ఓటు వేయగా.. 1877 మంది యశ్వంత్ సిన్హాకు ఓటు వేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,72,377. ఇందులో ముర్ముకు వచ్చిన ఓట్ల విలువ 6,76,803.. ఇక యశ్వంత్ సిన్హాకు వచ్చిన ఓట్ల విలువ 3,80,177గా ఉంది. మొత్తం పోలైన ఓట్ల విలువలో ద్రౌపది ముర్ము 64.04శాతం సాధించగా.. యశ్వంత్ సిన్హా కేవలం 35.97 శాతంతో సరిపెట్టుకున్నారు.
ఏపీలో వందశాతం ఓట్లు ముర్ముకే..
కాగా సిన్హాకు మద్దతు ప్రకటించిన పార్టీల ఓట్లు కొన్ని ముర్ముకు కూడా పడ్డాయి. ప్రతిపక్షపార్టీలకు చెందిన17 మంది ఎంపీలు, 102 మంది ఎమ్మెల్యేలు ఆమెకు ఓటేశారు. అసోం, ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి సొంత రాష్ట్రాల్లో కూడా దక్కనన్ని ఓట్లు అసలు ప్రాతినిధ్యమే లేని ఆంధ్రప్రదేశ్‌లో దక్కాయి. ఇక్కడ వంద శాతం మంది ప్రజాప్రతినిధులు ముర్ముకే ఓటేశారు. చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్, సిక్కింలలో మాత్రమే బీజేపీ వంద శాతం ఓట్లు దక్కించుకుంది. తెలంగాణ, కేరళ, పంజాబ్, ఢిల్లీల్లో ప్రధాన పార్టీలు రెండూ ముర్ముకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఆ రాష్ట్రాల్లో ఎన్డీయేకు అతి తక్కువ ఓట్లు దక్కాయి. ముర్మును బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంతో ఎన్డీయే యూపీఏ కూటములకు దూరంగా ఉన్న బీజేడీ, వైసీపీ, అన్నాడీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్, అకాలీదళ్ మద్దతును కూడగట్టగలిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..