Elections: అభ్యర్థుల నేర చరిత్ర.. పత్రికా ప్రకటనల్లో చూపించాలి : ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరికొస్తోంది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం తమ కసరత్తులను ముమ్మరం చేసింది. అయితే ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ బృందం మూడు రోజులపాటు రాజస్థాన్‌లో పర్యటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం ఓటింగ్‌ను మరింత సులభతరం చేయడంతోసహా.. ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరికొస్తోంది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం తమ కసరత్తులను ముమ్మరం చేసింది. అయితే ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ బృందం మూడు రోజులపాటు రాజస్థాన్‌లో పర్యటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం ఓటింగ్‌ను మరింత సులభతరం చేయడంతోసహా.. ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. అదే విధంగా పౌరులు కూడా తప్పనిసరిగా ఓటు వేయాలనే విషయంపై తమవద్ద ఎటువంటి ప్రతిపాదనను చేయలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను కూడా పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
అంతేకాకుండా ఎన్నికల బరిలోకి దింపేందుకు ఈ అభ్యర్థినే ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందనే కారణాలను సైతం రాజకీయ పార్టీలు వివరించాలని పేర్కొన్నారు. అలాగే తప్పుడు అఫిడవిట్లు, కులాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు, ఎన్నికల తాయిలాలు, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ వంటివి చేసినట్లైతే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వృద్ధులతో సహా.. 40 శాతం కంటే ఎక్కువగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే సౌలభ్యాన్ని రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే తప్పనిసరి ఓటింగ్ వేయాలా అని ఓ విలేకరీ ప్రశ్నించగా.. దానికి స్పందిస్తూ ఎన్నికల సంఘం ముందు ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావాలి. అందుకోసమే సీఈసీ రాజీవ్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌ల బృందం మూడురోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటన చేసింది. అంతేకాదు అక్కడి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను సైతం ఏర్పాటు చేసింది. అలాగే ఎన్నికల సమయంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం, నగదు సరఫరాపై భద్రతా సిబ్బంది గట్టి నిఘా ఉంచాలని.. ఎన్నికల సంఘం రాజస్థాన్‌లోని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. అక్టోబర్ 3 నుంచి ఎలక్షన్ కమిషన్ బృందం తెలంగాణలో కూడా మూడు రోజుల పాటు పర్యటన చేయనుంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.