Covid-19: కరోనా కల్లోలంపై రాజకీయం…! మహారాష్ట్రను కేంద్రం టార్గెట్ చేస్తోందంటూ…
దేశంలో కరోనా కల్లోలం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు గుప్తించుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని కేంద్రం ప్రశ్నిస్తుండగా...
దేశంలో నెలకొన్న కరోనా కల్లోలం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు గుప్తించుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని కేంద్రం ప్రశ్నిస్తుండగా… కోవిడ్ వ్యాక్సిన్ల కొరతపై బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మహారాష్ట్రలో కోవిడ్ ఉధృతికి ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఆరోపించారు. అయితే అధికార శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విమర్శలను తిప్పికొట్టారు. కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. మహారాష్ట్రకు అవసరమైన మేరకు కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేయనుందునే…కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేయాల్సిన దుస్థితి నెలకొంటోందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్తించారు. కరోనా వ్యాప్తి విషయంలో కేంద్రం మహారాష్ట్రను దురుద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందని అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ చేతగాని తనంతో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అస్తవ్యస్థంగా మారిందని ఆరోపించారు.
The Centre is targeting Maharashtra on the spread of COVID-19 ignoring hard facts
Maharashtra has vaccinated 80 per cent of healthcare workers. Nearly 20 states are behind Maharashtra
Maharashtra has vaccinated 73 per cent of frontline workers. Only 5 states have done better
— P. Chidambaram (@PChidambaram_IN) April 8, 2021
మహారాష్ట్ర సర్కార్‌కు చిదంబరం బాసట..
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో మహారాష్ట్ర చురుకైన పాత్ర పోషిస్తోందని గణాంకాలతో సహా చిదంబరం ట్వీట్ చేశారు. ఆ రాష్ట్రంలోని 80 శాతం హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. దాదాపు 20 రాష్ట్రాలు మహారాష్ట్ర కంటే వెనుకబడ్డాయని పేర్కొన్నారు. అలాగే 73 శాతం ఫ్రెంట్‌లైన్ వర్కర్స్‌కు మహారాష్ట్ర కోవిడ్ వ్యాక్సిన్లు ఇప్పించినట్లు పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు వ్యాక్సినేషన్ చేయడంలో మహారాష్ట్ర దేశంలో ఐదో స్థానంలో నిలుస్తున్నట్లు వివరించారు. మహారాష్ట్రకు అవసరమైన వ్యాక్సిన్లు ఎందుకు సరఫరా చేయడం లేదో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.