PMFME Scheme: ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా.? కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. దరఖాస్తు చేసుకోండిలా.!
కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది చిన్నా, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. లాక్‌డౌన్ వేళ ఉద్యోగాలు...
కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది చిన్నా, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. లాక్‌డౌన్ వేళ ఉద్యోగాలు కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు కేంద్రం మద్దతు తెలుపుతోంది. వివిధ రకాల పధకాల ద్వారా వారిని ఆదుకుంటోంది. అందులో ఒకటి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ (PMFME స్కీమ్). ఈ స్కీం గురించి ప్రజలకు ఎక్కువగా తెలియదు.
ఇది ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన పథకం. ఈ స్కీం ద్వారా ఫుడ్ ఇండస్ట్రీలో రాణించాలనుకునే వారికి కేంద్రం పెద్ద మొత్తంలో సహాయం చేస్తుంది. ఇటీవల, లోక్‌సభలో, కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ ఫుడ్, పానీయాల వ్యాపారంలో అడుగుపెట్టాలనుకునేవారికి ఈ పధకం ఎంతగానో ఉపయోగపడుతుందని.. సుమారు 5 సంవత్సరాలలో 10 వేల కోట్ల రూపాయల సహాయం అందించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోందని అన్నారు.
35 వేల కోట్ల పెట్టుబడి, 9 లక్షల మందికి ఉపాధి..
ఈ పథకాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తోంది. దీని కింద, చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రాసెసింగ్ ఫెసిలిటీస్, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్, ప్యాకింగ్, ఇంక్యుబేషన్ కేంద్రాలు సహా వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధిని 35 శాతం క్రెడిట్-లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడంలో ఇది దోహదపడుతుందని పేర్కొంది. ఈ పథకం ద్వారా ఎకానమీలో రూ. 35,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని.. అలాగే 9 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం చెబుతోంది.
ఒక్కో జిల్లాకి ఒక్కో ఉత్పత్తి.. రాష్ట్రాల నిర్ణయం.!
మంత్రిత్వ శాఖ ప్రకారం, ముడి పదార్థాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాకు ఒక ఆహార ఉత్పత్తిని గుర్తించడం రాష్ట్రాల బాధ్యత. ఈ ఉత్పత్తుల జాబితాలో మామిడి, బంగాళాదుంప, లిచీ, టమోటా, సాగో, టాన్జేరిన్, భుజియా, పెథా, పాపడ్, ఊరగాయ, మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు, మత్స్యసంపద, పౌల్ట్రీ, మాంసం అలాగే జంతువుల దాణా ఉన్నాయి. ఉత్పత్తుల సాగు, ప్రాధాన్యత ఆధారంగా పరిశ్రమలకు సహాయం అందుతుంది.
10 లక్షల వరకు ఆర్ధిక సహాయం..
మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం, ఉత్పత్తి యూనిట్‌కు గరిష్టంగా రూ. 10 లక్షల వరకు సహాయం అందుతుంది. దీనితో పాటు మార్కెటింగ్, బ్రాండింగ్ చేయాలనుకుంటే రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిలో 50 శాతం సబ్సిడీతో సహాయం లభిస్తుంది. మరోవైపు, మీరు స్వయం సహాయక బృందాన్ని నిర్వహించాలనుకుంటే, ప్రభుత్వం నుంచి రూ. 40 వేల సహాయాన్ని పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి..
PBNS నివేదిక ప్రకారం, మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, దీని కోసం మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల FME (https://pmfme.mofpi.gov.in/pmfme/#/Login) ) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. మొత్తం సమాచారాన్ని పూర్తీ చేసిన తర్వాత మీ ప్లాన్‌ను షేర్ చేయాలి.
ప్రజల సౌకర్యార్థం, మంత్రిత్వ శాఖ ప్రతి జిల్లాలో రిసోర్స్ పర్సన్‌లు నియమించింది. వారు యూనిట్ల కోసం DPRలను తయారు చేసి వివరిస్తారు. అలాగే, మీరు బ్యాంక్ నుండి రుణం తీసుకోవడం, ఇతరత్రా విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. యూనిట్లను ఏర్పాటు చేయాలనుకునేవారు తమ నోడల్ అధికారికి దరఖాస్తుతో పాటు DPRను కూడా పంపించాలి.
దరఖాస్తు చేసుకున్న అనంతరం ప్రభుత్వం దానిపై పూర్తిగా పరిశీలిన జరిపిన డబ్బును నేరుగా లబ్దిదారుడి ఖాతాలో జమ చేస్తుంది. కాగా, PM-FME పథకం కింద, ప్రభుత్వం 2020 నుండి 2025 వరకు 5 సంవత్సరాలలో 10 వేల కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది. ఈ మొత్తం వ్యయంలో, కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు, కేంద్రపాలిట ప్రాంతాలు 40 శాతం నిష్పత్తిని పంచుకుంటాయి.
#OneYearofPMFMEScheme | The @PMFMEScheme support clusters & groups such as FPOs, Self Help Groups, and producer cooperatives along with their entire value chain storage, common processing, marketing, and many more. pic.twitter.com/YyeNNKXPJZ
— FOOD PROCESSING MIN (@MOFPI_GOI) July 31, 2021