PM Modi Cabinet: ఒక్క ఫోన్ కాల్‌తో 12మంది కేంద్రమంత్రి పదవులు ఫసక్.. అసలు ఆ కాల్ ఎవరి నుంచి ఎవరికి వెళ్లింది!?

కొందరి పనితీరు కొలమానంగా అందలం ఎక్కించామని అధిష్టానం చెప్పుకుంటుంటే.. ప్రధాని మోదీతో సన్నిహితంగా ఉన్న, ముఖ్య నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేయడం విస్మయానికి గురిచేసింది.

PM Modi Cabinet: ఒక్క ఫోన్ కాల్‌తో 12మంది కేంద్రమంత్రి పదవులు ఫసక్.. అసలు ఆ కాల్ ఎవరి నుంచి ఎవరికి వెళ్లింది!?
Union Ministers Resignations
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 08, 2021 | 7:27 PM

PM Narendra Modi’s Cabinet: గత వారం పదిరోజుల నుండి దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలకంగా మారిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎట్టకేలకు ప్రధాని మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. అందులో కొందరి పనితీరు కొలమానంగా అందలం ఎక్కించామని అధిష్టానం చెప్పుకుంటుంటే.. ప్రధాని మోదీతో సన్నిహితంగా ఉన్న, ముఖ్య నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేయడం విస్మయానికి గురిచేసింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వ్యక్తిగతంగా మంత్రులను పిలిచి రాజీనామా చేయమని కోరినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు రాజీనామా చేసిన 12 మంది మంత్రులలో నలుగురు సీనియర్ కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, హర్షవర్ధన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌, డీవీ సదానంద గౌడ, సంతోష్‌కుమార్‌ గాంగ్వార్‌కు మంత్రి మండలి నుంచి ఉద్వాసన పలికారు.

ఇదంతా ఒక్క ఫోన్ కాల్‌తో జరిగిపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. 12 మంది మంత్రుల చేత రాజీనామా చేయించాలన్నదీ ఫోన్ కాల్ సారాంశం. దీంతో అతను సీనియర్ మంత్రులతో కలిపి.. 12మందికి ఫోన్ కాల్స్ చేయాల్సి వచ్చింది. నడ్డానే స్వయంగా 12 మంది కేంద్ర మంత్రులకు డయల్ చేసి, వారి రాజీనామాలను వెంటనే సమర్పించాలని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇందులో కీలకమైన విద్య, వైద్యం, న్యాయం, పర్యావరణ శాఖల మంత్రులు కూడా ఇందులో ఉండడం గమనార్హం. కీలక శాఖలు చూస్తున్న కేంద్రమంత్రులు రాజీనామా జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొనగా రాష్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ ఈ రాజీనామాలను ఆమోదించడం కూడా పూర్తయింది. ఇందులో రవిశంకర్ ప్రసాద్ కీలకమైన ఐటీ శాఖ చూస్తుండగా.. జావదేకర్ పర్యావరణశాఖను చూస్తున్నారు. గత మంత్రివర్గ విస్తరణలో జవదేకర్‌కు ప్రమోషన్ రాగా మలి విడతలో ఆయన బెర్త్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో వెంటనే తమ మంత్రి పదవులకు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, హర్ష్ వర్ధన్, రమేష్ పోఖ్రియాల్, సదానంద గౌడ, సంతోష్ గంగ్వార్, సంజయ్ ధోత్రే, దేబశ్రీ చౌదరి, రట్టన్ లాల్ కతారి రాజీనామా చేశారు. రాజీనామాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వీకరించి వెను వెంటనే ఆమోదముద్ర వేశారు. ఇక, మంగళవారం కర్ణాటక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మరో మంత్రి తవార్‌చంద్ గెహ్లాట్ రాజీనామా చేశారు.

అయితే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన రాజకీయ అంశాలలో ఈ ఇద్దరి రాజీనామా కీలకంగా కనిపిస్తుంది. మళ్ళీ అధికారిక ప్రతినిధులుగా పంపడానికి వారిని తొలగించారా.. లేక పని తీరు బాగాలేదని కారణంగానే ఉద్వాసన పలికారా అన్న దానిపై రకరకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. రవిశంకర్ ప్రసాద్ రాజీనామాకు ఈ మధ్యనే తలెత్తిన ట్విట్టర్ వివాదమే కారణమని ఓ ప్రచారం జరుగుతుంది. అంతర్జాతీయ సమాజంలో భారత్ సోషల్ మీడియాను నియంత్రిస్తుందనేలా కనిపించడంలో రవిశంకర్ తప్పిదమేనని కేంద్రం భావిస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్.. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన రోగుల వలనే ప్రకాష్ జవడేకర్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆయన క్రియాశీలకంగా లేనికారణంగానే బెర్త్ ఖాళీ చేయాల్సి వచ్చిందని.. ఆయన వలనే కోవిడ్ వ్యవహారంలో కేంద్రం పూర్తిగా విఫలమైన భావన కలిగిందని కేంద్రం భావించినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక.. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో వీరి సేవలను పార్టీ వాడుకోవడం కోసమే ఇప్పుడు వీరిని మంత్రి పదవులను నుండి తప్పించారనే వాదన కూడా వినిపిస్తోంది.

కోవిడ్ -19 మహమ్మారి విస్తరించడంతో హర్ష్ వర్ధన్ స్వతహా వైద్యుడు అయిన ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించారు. తరువాత భారతదేశం వ్యాక్సిన్ల అభివృద్ధికి కృషి చేశారు. ఏదేమైనా, సంక్షోభం మధ్యలో ఆయన చేసిన వివిధ వ్యాఖ్యలు, పరిస్థితిని ప్రభుత్వం నిర్వహించడాన్ని గట్టిగా సమర్థించినప్పటికీ, గ్రౌండ్ రియాలిటీ గురించి అజ్ఞానంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు.

మొత్తం మీద ఆరుగురు కేబినెట్ మంత్రులు, ఒక రాష్ట్ర మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), ఐదుగురు రాష్ట్ర మంత్రులు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తరువాత, వారిలో కొందరు తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను మార్చేసుకున్నారు. రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ బయోతో ప్రతిబింబించేలా మార్చారు. ‘పార్లమెంటు సభ్యుడు పాట్నా సాహిబ్ లోక్‌సభ, బీహార్’, ‘బీజేపీ కార్యకర్త’ అని రాసుకున్నారు. ఇక, జవదేకర్ ప్రొఫైల్ ‘పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ ‘ అంటూ పేర్కొన్నారు.

ఇదిలావుంటే, కొత్త కొలువుదీరిన కేబినెట్‌లోని 36 కొత్త ముఖాల్లో, ఎనిమిది మంది న్యాయవాదులు, నలుగురు వైద్యులు, ఇద్దరు మాజీ ఐఎఎస్ అధికారులు, నలుగురు ఎంబీఏ డిగ్రీ హోల్డర్లు, పలువురు ఇంజనీర్లతో కూడిన సంపూర్ణ నిష్ణాతులతో కూడినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో 15 మంది కేబినెట్ మంత్రులతో పాటు, 28 మంది రాష్ట్ర మంత్రులు, కొత్త ముఖాలు, ఉన్నతమైనవారు ఉన్నారు. అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ 43 మంది మంత్రులచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Read Also…. Suspicious death: డ్యూటీకంటూ వెళ్లాడు.. లారీలో విగతజీవిగా కనిపించాడు.. అనుమానాస్పద మృతి కలకలం