PM Modi’s Cabinet Rejig: కేబినెట్ విస్తరణ మరో 4 రోజుల్లో.. లేదంటే నాలుగు నెలల తర్వాతే..!

PM Modi's Cabinet Expansion: నేడో, రేపో అంటూ ఊరిస్తూ వస్తున్న కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జాప్యం కావడానికి చాతుర్మాసంతో పాటు పాత మిత్రులతో చిగురిస్తున్న కొత్త స్నేహమే కారణమని తెలుస్తోంది. నిజానికి ఈ పాటికే కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తికావాల్సి ఉంది.

PM Modi's Cabinet Rejig: కేబినెట్ విస్తరణ మరో 4 రోజుల్లో.. లేదంటే నాలుగు నెలల తర్వాతే..!
Mod Cabinet Expansion
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 05, 2021 | 5:52 PM

(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో)

PM Modi’s Cabinet Rejig: నేడో, రేపో అంటూ ఊరిస్తూ వస్తున్న కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జాప్యం కావడానికి చాతుర్మాసంతో పాటు పాత మిత్రులతో చిగురిస్తున్న కొత్త స్నేహమే కారణమని తెలుస్తోంది. నిజానికి ఈ పాటికే కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తికావాల్సి ఉంది. అయితే బీజేపీకి దగ్గరయ్యేందుకు శివసేన, శివసేనను దగ్గర చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న పరస్పర ప్రయత్నాల కారణంగానే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందని సమాచారం. జూన్ 8న మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశం కావడంతో ఈ పాత స్నేహబంధం మళ్లీ కొత్తగా తెరపైకొచ్చింది. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానిని కలవడాన్ని నిజానికి ఎవరూ తప్పుబట్టడానికి లేదు. కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకుని, ఎన్నికల తర్వాత వేరుపడి ప్రత్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన, ప్రధానితో సమావేశం అనంతరం వ్యవహరిస్తున్న తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. “మేము ఇండియా-పాకిస్తాన్ కాదు. ఆమిర్ ఖాన్ – కిరణ్ రావులను చూడండి. బీజేపీ-శివసేన బంధం అలాంటిదే. రాజకీయ మార్గాలు వేరైనా, స్నేహబంధం చెక్కుచెదరలేదు.” అంటూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మారిన వ్యవహారశైలిని ప్రతిబింబిస్తున్నాయి.

ముఖ్యమంత్రి పదవే కీలకం! నాడు బీజేపీ-సేన మధ్య విబేధాలకైనా, నేడు మళ్లీ స్నేహబంధం ముడిపడాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవే కీలకంగా మారింది. 2019 అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన సంఖ్యాబలం 145. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. బీజేపీ 105 స్థానాల్లో, శివసేన 56 స్థానాల్లో గెలుపొందగా, యూపీఏలో భాగంగా ఉన్న కాంగ్రెస్ 44 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 54 సీట్లలో గెలుపొందింది. మిత్రపక్షం బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలిచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భావించిన శివసేన ఫలితాల అనంతరం 56 సీట్లు మాత్రమే రావడంతో భంగపాటుకు గురైంది. ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న కాంక్షతో, బీజేపీని విడిచిపెట్టి ప్రత్యర్థులతో చేతులు కలిపింది. మహావికాస్ అఘాడీ పేరుతో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. అయితే సైద్ధాంతికంగా భావసారూప్యత కల్గిన బీజేపీని విడిచి, పూర్తిగా భిన్న ధృవాల్లా ఉండే ఎన్సీపీ-కాంగ్రెస్ తో సాగుతున్న ప్రభుత్వం కలహాల కాపురంగా మారింది. ఎన్సీపీకి చెందిన అనిల్ దేశ్‌ముఖ్‌ హోంమంత్రిగా వందల కోట్ల మేర వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఠాక్రే ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి. ఇవన్నీ పక్కనపెడితే.. త్వరలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల అనంతరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల్గినా, క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం అంత సులభం కాదని ఠాక్రేకు అర్థమైంది. దీంతో మళ్లీ బీజేపీతో కలిసేందుకు పావులు కదిపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Uddhav Thackeray Narendra Modi Meeting

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేఅయితే ఇప్పుడు బీజేపీతో కలిస్తే తక్కువ సీట్లున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం లేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకుంటూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా శివసేన చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. శివసేన కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో సీట్లు తెచ్చుకుని సీఎం పదవి లేకుండా ప్రభుత్వంలో చేరడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అసలేమాత్రం ఇష్టపడడం లేదు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇదే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో సీఎం పదవి ఉద్దవ్ ఠాక్రేకు కొనసాగిస్తూ, ఇద్దరు బీజేపీ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ఫార్ములా తయారు చేస్తున్నట్టు సరికొత్త ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఫడ్నవీస్‌ అసంతృప్తికి గురికాకుండా ఆయన్ను కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ డీల్ కారణంగా కేబినెట్ విస్తరణ ఆలస్యమవుతోందని చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ నాయకత్వం ఈ ఊహాగానాలను పూర్తిగా కొట్టిపడేస్తోంది.

చాతుర్మాస ప్రభావం బీజేపీ – శివసేన డీల్ సంగతెలా ఉన్నా.. కేబినెట్ విస్తరణపై ముహూర్తాలు కూడా ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చాతుర్మాసం పవిత్ర సమయం. శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉన్న నాలుగు హిందూ కాలమానంలోని నెలలను చాతుర్మాసంగా పరిగణిస్తారు. దేవశయని ఏకాదశి నుంచి ప్రబోధిని ఏకాదశి వరకు చాతుర్మాసం నిర్వహిస్తారు. ఈ ఏడాది చాతుర్మాసం జులై 20 నుంచి నవంబర్ 14 వరకు కొనసాగనుంది. ఈ నాలుగు నెలలు దైవచింతన, తపస్సు, సేవా కార్యక్రమాలు, పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. పవిత్ర మాసాలైనప్పటికీ పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను ఈ నాలుగు నెలల్లో జరపరు. కేంద్ర కేబినెట్ విస్తరణ చాతుర్మాసం ప్రారంభమయ్యేలోగా పూర్తిచేస్తారని, లేదంటే చాతుర్మాసం పూర్తయిన తర్వాతనే జరపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read..

YV Subba Reddy: మరోసారి టిటిడి ఛైర్మనా?.. మంత్రి లేక రాజ్యసభ సభ్యత్వమా?

పిల్లి కూత‌ల‌కు భ‌య‌ప‌డే వారెవ‌రూ లేరు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటల తూటాలు..