PM Modi: పాలిటిక్స్‌లోకి రండి.. రాజకీయ వారసత్వం లేని యువతకు ప్రధాని మోదీ పిలుపు

రాజకీయ వారసత్వం లేని యువకులు రాజకీయాల్లో రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యూపీలోని వారణాసిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. రాజకీయ వారసత్వం తప్ప ఆ పార్టీలు అభివృద్ధి గురించి పట్టించుకోవంటూ ధ్వజమెత్తారు.

PM Modi: పాలిటిక్స్‌లోకి రండి.. రాజకీయ వారసత్వం లేని యువతకు ప్రధాని మోదీ పిలుపు
Pm Narendra Modi
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 20, 2024 | 10:19 PM

కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ)లపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకపడ్డారు. ఆ రెండు పార్టీలు వారసత్వ రాజకీయాలకు (నెపోటిజం) పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో రూ.6,700 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడుతూ ప్రధాని మోదీ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. వారణాసి అభివృద్ధిని పక్కనపెట్టి ఆ రెండు పార్టీలు వారసత్వ రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. రాజకీయ వారసత్వం లేని యువకులు రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఉంటూ వారు దేశాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.

వారసత్వ రాజకీయాల కారణంగా దేశ యువతకు తీరని నష్టం కలిగిందని ప్రధాని మోదీ ఆరోపించారు. పదేళ్ల క్రితం వరకు వారణాసి అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. యూపీ, ఢిల్లీలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎస్పీ వారణాసిని ఎందుకు పట్టించుకోలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. భవిష్యత్తులోనూ వారణాసి అభివృద్ధికి కాంగ్రెస్, ఎస్పీలు ప్రాధాన్యత ఇవ్వబోవని అన్నారు.

సబ్‌కా వికాస్ లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు వసతులు పెంచేందుకు దేశంలో కొత్త రహదారులు, రైల్వే ట్రాక్‌లు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నట్లు గుర్తుచేశారు. పట్టణాభివృద్ధి అంటే వారణాసి గుర్తుకు వచ్చేలా.. ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత మూడు పర్యాయాలు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక కావడం తెలిసిందే.

వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ..