Narendra Modi:బెంగళూరు-మైసూర్‌ల మధ్య కనెక్టివిటీ పెంచడం ఎంతో ప్రత్యేకం: ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక టూర్‌లో బిజీ బిజీగా గడుపుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ హైవే రహదారిని ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో..

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక టూర్‌లో బిజీ బిజీగా గడుపుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ హైవే రహదారిని ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కర్ణాటకలో మొట్టమొదటి ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డును కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మించిందని నరేంద్ర మోదీ అన్నారు. మైసూరు మహరాజు కృష్ణరాజ వడయార్, సర్ ఎం విశ్వేశ్వరయ్య వలనే ఈ ప్రాంత్రం ఇంత అభివృద్ది చెందుతోందని, వీరిద్దరూ గతంలో కలలు కన్నారని, ఇప్పుడు వారి కలలు నేరవేరాయని, ఈ నేలను అభివృద్ది చెయ్యాలని అనేక ప్రయత్నాలు ఇద్దరూ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రెండు పట్టణాల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించాల్సిన అవసరంపై స్పందించిన ప్రధాని.. ‘కర్ణాటకలో బెంగళూరు, మైసూరు కీలకమైన నగరాలు. బెంగళూరు టెక్నాలజీకి పేరు గాంచింది. మైసూరు సాంస్కృతిక పరంగా ఎంతో ప్రాముఖ్యం చెందింది. ఇలాంటి రెండు ముఖ్యమైన నగరాల మధ్య కనెక్టివిటీ పెంచడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం బెంగళూరు మైసూరు హైవే ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. ఈ అభివృద్ధిని చూసి యువత ఎంతో గర్విస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులన్నీ మన దేశ పురోగతికి బాటలు వేస్తాయి. అని చెప్పుకొచ్చారు ప్రధాని. ఇదిలా ఉంటే మైసూర్ – బెంగళూరు మధ్య 118 కిలోమీటర్ల మేర హైవేను నిర్మించారు. ఇది యాక్సెస్ నియంత్రిత హైవే, రెండు వైపులా సర్వీస్ రోడ్డు రెండు లేన్లు ఉన్నాయి. ఈ హైవే ద్వారా మైసూర్ నుంచి బెంగళూరు మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గనుంది.




Here is why improved connectivity between Bengaluru and Mysuru is essential. pic.twitter.com/hZIU3YXNmf
— Narendra Modi (@narendramodi) March 12, 2023
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు కురిపించారు. పేదల కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ స్పందించలేదని అన్నారు. పేదలకు కేటాయించిన డబ్బు మొత్తం ఆనాడు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకున్నారని, పేదల ఇళ్లకు నీరు, గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత బీజేపీదేనని మోదీ అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల కర్ణాటక రైతులకు కూడా రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని అందుకే మరోసారి బీజేపీని మీరు ఆధరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




