Women’s Reservation Bill: మూడు దశాబ్దాల కలకు మోడీ సర్కార్ శ్రీకారం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్..!
Women's reservation bill: దశాబ్దాలుగా ఎప్పుడెప్పుడు ఆమోదం లభిస్తుందా అని ఎదురుచూస్తున్న కోట్లాది మంది మహిళలకు తీపికబురు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తారు. అంటే మూడింట ఒక వంతు సీట్లలో ఆడవారికే టికెట్లు ఇవ్వాలి..

Women’s reservation bill: పురుషుల ఆధిపత్యం ఎక్కువ కావడం, మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తోంది కేంద్రం. 33శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. దాదాపు 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోడీ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. ఎన్నో దశాబ్దాల కలను సాకారం చేసేందుకు.. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ప్రస్తుత లోక్‌సభలో 78 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. ఇది మొత్తం 543 మందిలో 15 శాతం కంటే తక్కువ. గత ఏడాది డిసెంబర్ నాటికి రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం కూడా 14 శాతం మాత్రమే. చాలా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఇప్పటికీ కనీసం 10శాతం మంది కూడా ప్రాతినిథ్యం వహించడం లేదు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ప్రస్తుతం 10 శాతం మంది కూడా మహిళా ప్రజాప్రతినిధులు లేరు. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, బీహార్‌లో 10 నుంచి 12 శాతం మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.
కొన్ని నెలలుగా బీఆర్‌ఎస్, బీజేడీ సహా పలు రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ధర్నాకు దిగారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. హైదరాబాద్‌లో జరిగిన CWC సమావేశాల్లోనూ ఈబిల్లుపై తీర్మాణం చేసింది కాంగ్రెస్. దీంతో ఈ బిల్లుకు మరింత ప్రాధాన్యత పెరిగింది.
ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్లపై కేంద్రం వేగంగా చర్యలు చేపట్టడంతో ఎమ్మెల్సీ కవిత సంతోషం వ్యక్తంచేశారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ బిల్లు విషయంలో సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారామె.
వాస్తవానికి 1996, 1998, 1999, 2008, 2010లో ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పటికీ అనేక కారణాలతో వీగిపోయింది. గీతా ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 1996 నాటి బిల్లులో ఏడు అంశాలను ప్రతిపాదించింది. అందులో ఐదు అంశాలు యథావిథిగా 2008 నాటి బిల్లుల్లో పొందుపరిచారు. అయితే ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు అప్పట్లో ఈ బిల్లును వ్యతిరేకించాయి.
ఇదే బిల్లు 2010లో పార్లమెంట్ ముందుకు వచ్చింది. అప్పట్లో చాలా మంది ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. అనేక గందరగోళం మధ్య రాజ్యసభలో ఈ బిల్ పాస్ అయింది. కానీ లోక్‌సభలో ఈ బిల్లుకు బ్రేక్ పడింది.
మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు.. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ ట్వీట్ చేసారు. ఆ తర్వాత కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ బుధవారం ఈ బిల్లు లోక్‌సభలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఏయే పార్టీల వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..