AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశా తీరంలో షిప్ మునక.. 24 మంది గల్లంతు

ఒడిశా తీరానికి 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండా కలిగిన ఎంవీ ఓషన్-విన్నర్ నౌక మునిగిపోయింది. 1,700 టన్నుల ఇనుప ఖనిజంతో సింగపూర్‌కు వెళ్తున్న ఈ నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నారు. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఒడిశా తీరంలో షిప్ మునక.. 24 మంది గల్లంతు
Cargo Ship
SN Pasha
|

Updated on: Aug 23, 2026 | 6:04 AM

Share

ఒడిశా తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ఎంవీ ఓషన్ విన్నర్ అనే ఈ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20 మంది చైనాకు చెందినవారు కాగా, ముగ్గురు మయన్మార్‌కు, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. అధికారుల వివరాల ప్రకారం.. నౌక సుమారు 1,700 టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసుకుని సింగపూర్‌కు బయలుదేరింది. ఆగస్టు 20వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో ఒడిశాలోని పారాదీప్ పోర్టు నుంచి నౌక ప్రయాణం ప్రారంభించింది. అయితే, సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో అనూహ్యంగా ప్రమాదానికి గురై మునిగిపోయినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 22వ తేదీ ఉదయం 11.48 గంటల సమయంలో నౌకతో సంబంధాలు తెగిపోయినట్లు శ్రీ విజయపురంలోని సముద్ర రక్షణ సమన్వయ కేంద్రానికి సమాచారం అందింది. నౌకను నిర్వహిస్తున్న విక్టరీ స్టార్ గ్రూప్ కో లిమిటెడ్ సంస్థ నుంచి గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ అత్యవసర సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే భారత తీరరక్షక దళం, భారత నౌకాదళం సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు చర్యల కోసం వరద్, అన్మోల్ అనే కోస్ట్ గార్డ్ నౌకలను రంగంలోకి దించారు. ఆపరేషన్‌కు అదనపు సహకారం అందించేందుకు శ్రీ విజయపురం నుంచి విజిత్ అనే మరో నౌకను కూడా పంపించారు.

సముద్రంలో ప్రతికూల పరిస్థితులు, విస్తృత ప్రాంతంలో గాలింపు నిర్వహించాల్సి ఉండటంతో సహాయక చర్యలు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో ఎంతమంది రక్షించబడ్డారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. “ఎంత మంది సిబ్బందిని రక్షించారో మాకు కచ్చితంగా తెలియదు” అని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. ప్రమాద ప్రాంతానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఇతర నౌకలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యల్లో సహకరించాలని వాటిని కోరారు. ప్రస్తుతం భారత నౌకాదళం, తీరరక్షక దళం సముద్రంలో విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, నౌకలోని సిబ్బంది పరిస్థితిపై అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us