AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్ ఎకానమీపై చిదంబరం సంచలన కామెంట్స్.. కేంద్రానికి కీలక సూచనలు

Indian Economy: దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం(P Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఇండియన్ ఎకానమీపై చిదంబరం సంచలన కామెంట్స్.. కేంద్రానికి కీలక సూచనలు
Sr Congress Leader, Ex- Finance Minister P Chidambaram
Janardhan Veluru
|

Updated on: May 14, 2022 | 12:15 PM

Share

Indian Economy: దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం(P Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రపంచ, దేశీయ తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత దేశ ఆర్థిక విధానాలను రీసెట్(Reset) చేయాల్సిన అవసరముందని కేంద్రానికి సూచించారు. మోడీ సర్కారు ఏలుబడిలో గత ఎనిమిదేళ్లుగా దేశ వృద్ధి రేటు ఏటికేడు మందగించిందని పెదవి విరిచారు. కరోనా సంక్షోభం తర్వాత కూడా వృద్ధి రేటు కోలుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. దిగజారుతున్న ఈ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల ‘చింతన్ శివిర్’లో ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థపై ప్యానెల్‌కు చిదంబరం సారథ్యంవహిస్తున్నారు. ఉదయపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సమగ్ర సమీక్షకు సమయం ఆసన్నమైందన్నారు. 2017లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్ట జీఎస్‌టీ చట్టాల గురించి అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్థితి మునుపెన్నడూ లేని విధంగా బలహీనంగా ఉన్నాయని.. దీనికి తక్షణ పరిష్కార చర్యలు అవసరమని చిదంబరం పేర్కొన్నారు.

1991లో పీవీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరళీకరణతో కొత్త శకానికి నాంది పలికిందని పి.చిదంబరం గుర్తుచేశారు. సంపద సృష్టి, కొత్త వ్యాపారాలు, కొత్త పారిశ్రామికవేత్తలు, భారీ మధ్యతరగతి, లక్షలాది ఉద్యోగాలు, ఎగుమతులతో దేశం అపారమైన ప్రయోజనాలను పొందిందని గుర్తుచేశారు. కేవలం పదేళ్ల కాలంలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. అయితే గత ద్రవ్యోల్భణం పెరిగిపోతున్నా.. కట్టడి చేయలేని అసమర్థ స్థితిలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

30 సంవత్సరాల తర్వాత.. ప్రపంచ, దేశీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక విధానాలను రీసెట్ చేయడంపై ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆర్థిక విధానాల రీసెట్ అనేది దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, దిగువ 10 శాతం జనాభాలోని అత్యంత పేదరికం, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ (116 దేశాలలో 101), మహిళలు పిల్లల్లో విస్తృతమైన పోషకాహార లోపం తదితర సమస్యలకు పరిష్కారం చూపేదిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుత ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్రానికి దార్శనికత లోపించిందని ఎద్దేవా చేశారు.

Also Read..

NEET PG 2022: నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదాను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం సబబేనా? విద్యార్ధులకు చేకూరే నష్టమెంత..

EPFO Rules: పీఎఫ్‌ ఖాతాదారుడు మరణిస్తే కుటుంబానికి పెన్షన్‌ వస్తుందా..? నిబంధనలు ఏమిటి?