NEET PG 2022: నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదాను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం సబబేనా? విద్యార్ధులకు చేకూరే నష్టమెంత..
మెడికల్ విద్యార్ధుల పోరాటానికి ఫలితం దక్కలేదు. నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం (మే 13) కొట్టివేసింది. దీనిపై..
Supreme Court dismisses plea to postpone NEET PG 2022 exam: నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం (మే 13) కొట్టివేసింది. నీట్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయడం వల్ల విద్యార్ధుల్లో గందరగోళం, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో నీట్ పీజీ 2022 పరీక్ష యథాతదంగానే మే 21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు జరగనుంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత మోడ్‌లో నిర్వహించబడుతుంది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 16 నుంచి అధికారిక వెబ్‌సైట్ లో విడుదలవుతాయి.
నీట్ పీజీ 2022 వాయిదావేయాలని విద్యార్ధులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? నిజానికి గతంలో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష తేదీ మార్చి 12గా నిర్ణయించినప్పటికీ కేంద్ర ఆరోగ్య మంత్రి జోక్యంతో పరీక్ష ఆరు నుండి ఎనిమిది వారాల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET)ను మే 21న నిర్వహించనున్నట్లుగా ఫిబ్రవరి 3న ప్రకటించింది.
మార్చి 10 నుంచి నిరసనలు.. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలనే మార్చి 10 నుంచి విద్యార్ధులు నిరసనలు ప్రారంభించారు. గత వారం రోజులుగా మరింత తీవ్రతరం చేశారు. చాలా మంది విద్యార్ధులు (ఏప్రిల్ నెలలో) సోషల్ మీడియా ద్వారా కూడా పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థించారు. ప్రిపరేషన్ సమయం లేకపోవడం వల్ల కనీసం 8 నుండి 10 వారాల పాటు వాయిదా వేయాలని విద్యార్ధులు కేంద్రాన్ని కోరారు. నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021 పరీక్ష ఆలస్యమైందని, పరీక్షకు సిద్ధమవడానికి తగినంత సమయం ఇవ్వాలని, అందువల్లనే పరీక్ష వాయిదా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన 15 మంది వైద్య విద్యార్ధులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
ఏప్రిల్ 27న.. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021 ఇంకా కొనసాగుతూనే ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది నీట్ పీజీ 2022 ప్రవేశ పరీకను నిర్వహించడం అన్యాయమని, ప్రిపరేషన్ కు కొంత సమయం ఇవ్వవలసిందిగా కోరుతూ అనేక మెడికల్ ఆర్గనైజేషన్లు, దరఖాస్తుదారులు ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకు లేఖలు రాశారు.
ఏప్రిల్ 28న.. పరీక్ష తేదీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కొందరు నీట్ పీజీ అభ్యర్థులు జంతర్ మంతర్‌లో కూడా నిరసనలు తెలిపారు.
నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలని ఐఎమ్‌ఏకు లేఖ.. నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డాక్టర్ మాండవ్యకు లేఖ రాసింది. కోవిడ్ ఉధృతి సమయంలో డ్యూటీల కోసం ఎక్కువ సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండేలా చూసేందుకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-PG) 2021 పరీక్షను నిర్వహించడంలో జాప్యం జరిగింది. షెడ్యూల్ చేసిన ఐదు నెలల తర్వాత సెప్టెంబరు 2021లో ప్రవేశ పరీక్ష నిర్వహించింది. అంతేకాకుండా మెడికల్ సీట్ల రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్‌లో ఉన్న కారణంగా కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అక్టోబర్ 25, 2021న ప్రారంభంకావల్సిన కౌన్సెలింగ్ మార్చి 31, 2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా మరింత ఆలస్యమైంది. స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మాప్-అప్ రౌండ్ ను నిర్వహించిందని తెలుపుతూ ఈ ఏడాది కూడా పరీక్ష తేదీని మార్చాలని లేఖలో పేర్కొంది.
సుప్రీంకోర్టుకు చేరిన వివాదం.. నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్‌లో తలెత్తిన వైరుధ్యాలను ఉటంకిస్తూ పరీక్షను వాయిదా వేయాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి అత్యున్నత ధర్మాసనం ఎట్టకేలకు అంగీకరించింది. సీనియర్ న్యాయవాది రాకేష్ ఖన్నా అభ్యర్థనల మేరకు శుక్రవారం (మే 13) డివై చంద్రచూడ్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పిటీషన్‌ను కొట్టివేస్తూ సుప్రీం తీర్పు.. నీట్ పరీక్షను వాయిదా వేయడం అంత మంచి ఆలోచన కాదని, ఈ పరీక్ష కొంతమంది విద్యార్థులకు మాత్రమే ఇబ్బందిని కలిగిస్తుందని అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీట్ పీజీ 2022కి సిద్ధమైన విద్యార్థులే అధికంగా ఉన్నారని, పరీక్ష వాయిదా విద్యార్ధుల్లో గందరగోళాన్ని, అనిశ్చితిని సృష్టిస్తుందని బెంచ్ పేర్కొంది. పరీక్షకు సిద్ధమైన 2 లక్షల మంది అభ్యర్థులతో పాటు రోగుల చికిత్సపై కూడా ప్రభావం పడుతుందని’ ధర్మాసనం ఉటంకించింది. నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ జరుగుతున్నందున, ఈ సమయంలో నీట్ పీజీ 2022 పరీక్ష జరపవద్దని, వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఈ మేరకు ధర్మాసనం తోసిపుచ్చింది.
ఈ ఆర్టికల్ న్యూస్ 9 వెబ్‌సైట్‌లో ప్రచురించిన కథనం ఆధారంగా రాయడం జరిగింది.
Also Read: