ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా అమ్మినందుకు ఉద్యోగులను టార్చర్ పెట్టిన ప్లాంట్ యజమాని, ఎఫ్ ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఆక్సిజన్ సిలిండర్లను తమ ప్లాంట్ నుంచి దొంగిలించుకునిపోయి అక్రమంగా అమ్మినందుకు తమ సంస్థలో పని చేస్తున్న ఐదుగురు ఉద్యోగులను ఆ ప్లాంట్ యజమాని, ఆయన కూతురు తీవ్రంగా కొట్టి చిత్ర హింసలకు గురి చేశారు...
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఆక్సిజన్ సిలిండర్లను తమ ప్లాంట్ నుంచి దొంగిలించుకునిపోయి అక్రమంగా అమ్మినందుకు తమ సంస్థలో పని చేస్తున్న ఐదుగురు ఉద్యోగులను ఆ ప్లాంట్ యజమాని, ఆయన కూతురు తీవ్రంగా కొట్టి చిత్ర హింసలకు గురి చేశారు. ఈ నెల 15 న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ ప్లాంట్ యజమానిపై కేసు దాఖలు చేశారు. తమ ఫ్యాక్టరీ నుంచి తాము కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను దొంగిలించి అక్రమంగా అమ్మిన మాట నిజమేనని రాజ్ వర్మ అనే కార్మికుడు అంగీకరించాడు. మా యజమాని అనుమతి లేకుండా ఇలా చేశామన్నాడు. అయితే ఇతనితో బాటు మరో నలుగురు కార్మికులను ఈ ప్లాంట్ యజమాని, అతని కూతురు అరగంటపాటు తీవ్రంగా కొట్టడమే గాక ఓ గదిలోకి తీసుకు వెళ్లి ఐస్ నింపిన బకెట్ లో బలవంతంగా నిలబెట్టారని, ఒకరి నోట్లో ఐస్ ,కారాన్ని కూరారని తెలిసింది. ఆ తరువాత బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో తాము ఆ యజమానిపై కేసు పెట్టామని ఇండోర్ ఎస్పీ అశుతోష్ బాగ్రి తెలిపారు. వీరు చేసింది నేరమే అయినా ఈ యజమాని చట్టాన్ని తన చేతుల్లో తీసుకోకుండా ఉండాల్సిందని, మాకు ఫిర్యాదు చేయాల్సి ఉండిందని ఆయన చెప్పారు. కాగా ఘటన జరిగిన సమయంలో ఇద్దరు పోలీసులు అక్కడే ఉన్నారన్న బాధితులి వాదనను ఆయన అంగీకరించలేదు. ఈ ప్లాంట్ బయట పోలీసులు ఉన్నారని, లోపల లేరని, అయినా సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తామని, ఉన్నట్టు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
కోవిద్ సమయంలో ఆక్సిజన్ కోసం రోగులు అల్లాడుతున్న సమయంలో ఈ ప్లాంట్ ఉద్యోగులు ఇలా సిలిండర్లను తీసుకుపోయి అమ్మడం అక్రమమే అయినా వీరిని చిత్ర హింసలకు గురి చేయడం మాత్రం క్షంతవ్యం కాదని అంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : 5 tigers and 1 monkey viral video :ఒకేసారి ఐదు పులుల్ని ముప్పతిప్పలు పెట్టిన వానరం..కోతి చేష్టలుకు అల్లాడిపోయిన పులులు.
సాయం పొందిన రియల్ హీరో..! ఆ అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు – సోను సూద్ :Sonu Sood video.