Crime News: అలా ఎలా నమ్ముతార్రా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలన్నారు.. కట్‌చేస్తే..
ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాధించొచ్చని.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఓ కేటుగాడు చెప్పిన మాటలను నమ్మి.. ఓ యువకుడిని సర్వం కోల్పోయాడు. అతడు చెప్పినట్టు ఫలు దఫాలుగా ఇన్వెస్ట్ చేసి ఏకంగా రూ.55 లక్షల వరకు లాస్ అయ్యాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడిన సదురు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వ్యవహారంలో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్ ద్వారా ప్రజలను మోసం చేసిన కేసులో పుణే (మహారాష్ట్ర)కు చెందిన విషాల్ అనిల్ నిర్మల్‌ను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి, నకిలీ లాభాలు చూపిస్తూ బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో బాధితుడు సికింద్రాబాద్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి. 2021లో అతడికి వాట్సాప్ ద్వారా ANGELBET777 అనే ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్ ద్వారా సులభంగా డబ్బులు వస్తాయని సందేశాలు వచ్చాయి. మొదట రూ.10 వేలు పెట్టుబడి పెట్టగా స్వల్ప లాభం రావడంతో నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత అదే ఏడాది మొత్తం రూ.10 లక్షలు వివిధ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాడు. చివరకు మొత్తం డబ్బు కోల్పోయాడు.
2022లో మరోసారి విషాల్ బాధితుడిని సంప్రదించి GOEXCH777 అనే మరో బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఈ మాటలు నమ్మిన బాధితుడు 2021 నుంచి 2025 మధ్య కాలంలో బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లు, యూపీఐ, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా మొత్తం రూ.55 లక్షలు పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయాడు. దీంతో ఈ సారి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ యాక్ట్ 66C, 66D సెక్షన్లు, బీఎన్‌ఎస్, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో విషాల్ అనిల్ నిర్మల్ తన సహచరులు గుడ్డు, డ్వీడే, సూరజ్ భూషాల్ అలియాస్ బోక్షితో కలిసి వ్యవస్థబద్ధంగా ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ నడిపినట్లు గుర్తించారు.విషాల్ గతంలో పుణేలో ఫైనాన్స్ కంపెనీలో పనిచేసి, 2021లో దుబాయ్ వెళ్లి అక్కడ అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు పెంచుకున్నాడు. అక్కడే సూరజ్ భూషాల్ పరిచయంతో బెట్టింగ్ ఏజెంట్ ఐడీలు తీసుకుని భారత్‌లో అక్రమ కార్యకలాపాలు కొనసాగించాడు. GOEXCH777 ప్లాట్‌ఫామ్‌లో ఏజెంట్ ఐడీ తీసుకుని WORLD777 అనే సబ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.
ఈ రాకెట్‌ను నడిపేందుకు నకిలీ షెల్ కంపెనీల పేర్లపై 57 బ్యాంక్ ఖాతాలు తెరిచి, వాటిని మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించాడు. కస్టమర్లు డబ్బులు జమ చేసిన తర్వాతే బెట్టింగ్ ఐడీలు ఇచ్చేవారు. అలాగే 79 సిమ్ కార్డులు, విదేశీ సిమ్‌లను ఉపయోగించి బాధితులను సంప్రదించేవాడు. సిమ్ బ్లాక్ అయితే వెంటనే కొత్త సిమ్ ఉపయోగించేవారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ల్యాప్‌టాప్, 15 మొబైల్ ఫోన్లు, 57 చెక్‌బుక్స్, 79 సిమ్ కార్డులు, 62 డెబిట్ కార్డులు, 15 రబ్బర్ స్టాంపులు, 8 క్యూఆర్ కోడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీఆర్పీ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా కనీసం 22 సైబర్ మోసాల కేసులు ఈ షెల్ కంపెనీ ఖాతాలతో సంబంధం ఉన్నట్లు తేలింది. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
