‘అన్ని బ్యాంకులనూ ప్రైవేటీకరించం’, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ, ఉద్యోగుల భద్రతకు ఢోకా లేదు
దేశంలో అన్ని బ్యాంకులనూ ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ దేశ ప్రజల ప్రయోజనాలను బ్యాంకులు పరిరక్షించాలని తాము కోరుతున్నామని ఆమె చెప్పారు.
దేశంలో అన్ని బ్యాంకులనూ ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ దేశ ప్రజల ప్రయోజనాలను బ్యాంకులు పరిరక్షించాలని తాము కోరుతున్నామని ఆమె చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏ బ్యాంకునైనా ప్రైవేటీకరించిన పక్షంలో ఆ బ్యాంకు ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. దేశ వ్యాప్తంగా రెండు రోజులపాటు సుమారు 10 లక్షలమంది బ్యాంకు సిబ్బంది సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ హామీ ఇఛ్చారు. బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్ల ప్రభుత్వ విధానం కొనసాగుతుందని పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైస్ పాలసీ స్పష్టం చేస్తోందన్నారు. మరిన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇందుకు నిరసనగా రెండు రోజుల దేశ వ్యాప్త సమ్మెకు తొమ్మిది బ్యాంకు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో చెక్కుల క్లియరెన్సులు, విత్ డ్రాలు, రెమిటెన్స్ లు నిలిచిపోయాయి. అయితే ఐసీ ఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకులు పని చేశాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె కారణంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నిన్న 6,500 కోట్ల విలువైన 86 లక్షల చెక్కులు, ఇంస్ట్రు మెంట్లు క్లియర్ కాలేదని బ్యాంక్ యూనియన్ లీడర్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా సుమారు 16,500 కోట్ల విలువైన 2 కోట్ల చెక్కులు, ఇంస్ట్రుమెంట్లు క్లియర్ కాలేదని వారు చెప్పారు. పలు ఏటీఎం లలో నగదు లేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు అన్నారు. ఇండియా వంటి వర్ధమాన దేశంలో బ్యాంకుల ప్రైవేటీకరణ అన్నది సముచితం కాదని వీరు ఖండించారు. ప్రజలకు సేవలు అందించాలన్నది బ్యాంకుల బాధ్యత అని, కానీ ప్రైవేటీకరించడం వల్ల ప్రయోజనం ఏముంటుందని వారు ప్రశ్నించారు. కాగా.. అన్ని బ్యాంకులనూ ప్రైవేటీకరించబోమన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనపై బ్యాంకింగ్ యూనియన్లు ఇంకా స్పందించాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి:L Ramana : అమరావతిని ఎంపిక చేసిన తరువాతే అసైన్డ్ భూములు తీసుకున్నారు : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు