రైల్వే శాఖ కొత్త రూల్స్.. రైళ్లలో రద్దీకి చెక్! ఇకపై వారికి మాత్రమే రైళ్లలో ప్రయాణించే అవకాశం
భారతీయ రైల్వేలు రైళ్లలోని అన్ని సీట్లకు మాత్రమే టిక్కెట్లు విక్రయించే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి కూడా సీట్లు ఖాళీగా ఉంటే మాత్రమే టిక్కెట్లు ఇస్తారు. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణీలకు కింది బెర్తుల కేటాయింపు కొనసాగుతుంది. దివ్యాంగులు, విద్యార్థులు, ఇతర రకాల రాయితీలూ కొనసాగుతాయి. ఈ చర్య రైళ్లలోని రద్దీని తగ్గిస్తుంది.

రైళ్లలో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుంటే, అది కన్ఫామ్ అయితే హ్యాపీగా ప్రయాణించవచ్చు. వెయింట్ లిస్ట్‌లో ఉంటే ఇబ్బందులు తప్పవు. అలాగే జనరల్‌లో వెళ్లాంటే వామ్మో అది పెద్ద సాహసమనే చెప్పాలి. ఓ రెండు బ్యాగులు, భార్యా పిల్లలతో కలిసి జనరల్‌లో ప్రయాణిచాలంటే అంతకంటే నరకం మరొకటి ఉండదు. కొన్ని సార్లు రిజర్వేషన్స్ బోగీలు కూడా నిండిపోతూ ఉంటాయి. రిజర్వేషన్ లేని వాళ్లు, జనరల్ టిక్కెట్‌తో ఎక్కేస్తుంటారు. అలాగే కొంతమంది ఏకంగా టిక్కెట్ కొనకుండా ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి వారికి రైల్వే శాఖ చెక్ పెట్టాలని భావిస్తోంది. అందుకోసం కొత్త రూల్‌ను ఇండియన్ రైల్వేస్ తీసుకొరానుంది. రైళ్లలో ఎన్ని సీట్లు ఉంటాయో.. అన్ని మాత్రమే టికెట్లు అమ్మాలి అని నిర్ణయించుకుంది.
అందువల్ల టికెట్ పొందేవారికి తప్పనిసరిగా సీటు ఉంటుంది. పార్లమెంటులో రైల్వేలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్లు ఎన్ని ఉన్నాయో, అన్ని టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు. అంటే త్వరలో.. సీట్లు లేనప్పుడు టికెట్లు ఇవ్వరు. అందువల్ల సీటు లేని వారు రైలు ఎక్కరు. తద్వారా వేరే వారి సీటులో మరొకరు వచ్చి కూర్చునే వీలు ఉండదు. అలా ఎవరైనా కూర్చున్నారంటే.. వారు టికెట్ లేకుండా రైలు ఎక్కినట్లే. ఐతే.. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు.. కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వారికి టికెట్ ఇచ్చేటప్పుడు.. రైల్వే శాఖ.. సీట్లు ఉన్నంతవరకు మాత్రమే ఇస్తుంది. సీట్లు లేకపోతే, ఆ వెయిటింగ్ లిస్ట్ వారికి టికెట్ ఇవ్వదు.
ఈ నిర్ణయం వల్ల రైళ్లలో విపరీతమైన రద్దీ సమస్య తొలగినట్లే. అలాగే ఇకపై స్లీపర్ క్లాస్ కోచ్‌లో 6 నుంచి 7 లోయర్ బెర్తులనూ, అలాగే.. 3AC కోచ్‌లో 4 నుంచి 5 లోయర్ బెర్తులనూ, 2ACలో 3 నుంచి 4 లోయర్ బెర్తులను సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణీలకు కేటాయిస్తామన్నారు. అందువల్ల వారంతా కింది బెర్తులలో పడుకునేందుకు వీలవుతుంది. రైళ్ల టికెట్లలో తగ్గింపును ఇకపై కూడా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. అంటే.. ప్రస్తుతం దివ్యాంగులకు టికెట్‌లో సబ్సిడీ ఉంది. అలాగే 11 రకాల కేటగిరీల పేషెంట్లు, 8 రకాల కేటగిరీల విద్యార్థులకు కూడా టికెట్ ధరపై తగ్గింపు లభిస్తోంది. ఇకపై కూడా ఈ తగ్గింపు కంటిన్యూ అవుతుంది అని మంత్రి వివరించారు. భారతీయ రైల్వే, ప్రయాణికుల భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.