Big Breaking: ఉరి తప్పించుకునేందుకు నిర్భయ దోషుల కొత్త ఎత్తు
నిర్భయ కేసు దోషులు తమకు విధించిన మరణ శిక్షనుంచి తప్పించుకునేందుకు దొరికిన ప్రతీ ఎత్తును వినియోగించుకుంటున్నారు. నలుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు తమకున్న అవకాశాలను వినియోగించుకుంటూ ఉరి శిక్షనుంచి తప్పించుకుంటూనే వున్నారు.
Nirbhaya case convicts are trying their best to escape from Capital punishment: నిర్భయ కేసు దోషులు తమకు విధించిన మరణ శిక్షనుంచి తప్పించుకునేందుకు దొరికిన ప్రతీ ఎత్తును వినియోగించుకుంటున్నారు. నలుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు తమకున్న అవకాశాలను వినియోగించుకుంటూ ఉరి శిక్షనుంచి తప్పించుకుంటూనే వున్నారు. తాజాగా వారు వేసిన ఎత్తుగడ యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జనవరిలో ట్రయల్ కోర్టు నిర్భయ కేసులో నలుగురు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్‌లకు ఉరి శిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వారు అప్పట్నించి క్షమాభిక్ష పేరిట, క్యూరేటివ్ పిటిషన్ల పేరిట ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. వారికి సహకరిస్తున్న న్యాయవాదుల సలహాలతో ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక లిటిగేషన్ వాడుకుంటూ ఉరిని వాయిదా వేయించుకుంటూనే వున్నారు. ఇప్పటికి రెండు సార్లు ఉరి శిక్ష తేదీ ఖరారైనా ఏదో సాకుతో తప్పించుకుంటూనే వస్తున్నారు. తాజాగా మార్చి 20న ఉదయం అయిదున్నరకు దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాలంటూ పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
ఉరి అమలు దగ్గర పడుతుండడంతో నలుగురు నిందితులు మరోసారి శిక్ష అమలును వాయిదా వేయించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముందుకు రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనను సరిగ్గా పరిశీలించలేదంటూ సుప్రీంకోర్టును మరోసారి సోమవారం ఆశ్రయించారు దోషులు. క్యూరేటివ్ పిటిషన్ల కొట్టివేత, క్షమాభిక్ష పిటిషన్ల తిరస్కారాలను సవాల్ చేస్తూ దోషులు నలుగురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. వారి అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
ఆ తర్వాత వారు అనూహ్యమైన అడుగు వేశారు. మరణశిక్ష అమలుపై స్టే కోరుతూ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె)ను ఆశ్రయించారు నిర్బయ కేసులో శిక్ష పడ్డ ముగ్గురు దోషులు. నిర్భయను దారుణంగా రేప్ చేసి… అత్యంత కిరాతంగా హత్య చేసిన ముగ్గురు దోషులు అక్షయ్, పవన్ మరియు వినయ్ ఈ కేసును అంతర్జాతీయ సమాజం ముందుంచేందుకు తెగించారు. అయితే.. వీరి పిటిషన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.