కరోనా కంట్రోల్‌కి వస్తోందని నిర్లక్ష్యం కూడదు, ప్రజలకు మహా సీఎం విజ్ఞప్తి
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తెలిపారు. పండుగల సీజన్‌లో ప్రజలు సంయమనం పాటించడం వల్లనే కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తెలిపారు. పండుగల సీజన్‌లో ప్రజలు సంయమనం పాటించడం వల్లనే కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు. కరోనా కంట్రోల్ అవుతుంది కదా అని నిర్లక్ష్యం కూడదని చెప్పారు. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాల్సిందేనన్నారు. ఉదాసీనంగా ఉంటే కరోనా ముప్పు భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. దీపావళి పండుగను ప్రజలు చాలా జాగ్రత్తగా జరుపుకున్నారని, బాణాసంచా కాల్చకూడదన్న తన విన్నపాన్ని జనమంతా మన్నించారని ఉద్ధవ్ పేర్కొన్నారు.. బాణాసంచా కాల్చకూడదని చెప్పినందుకు తనపై కొందరికి కోపం ఉంటే ఉండవచ్చు కానీ జనం మేలు కోసమే తాను ఆ పిలుపిచ్చానని వివరించారు. దీపావళి పండుగ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పినప్పటికీ చాలా మంది మాస్కులు ధరించకుండా తిరిగారని, కరోనా కంట్రోల్‌లోకి వచ్చిందన్న భ్రమలు వీడాలని చెప్పారు.. యూరప్ దేశాలతో పాటు ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో వచ్చిన రెండో దశ కరోనా వ్యాప్తి ఎంత భయానంగా ఉందో మనం చూస్తున్నామని తెలిపారు.. సునామీలా విరుచుకుపడుతున్నదని అన్నారు. అహ్మదాబాద్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని థాక్రే అన్నారు. ప్రార్థనా మందిరాలలో, దేవాలయాలో జనం గుమికూడవద్దని సూచించారు. లాక్‌డౌన్ విధించాలన్న ఉద్దేశం తనకు లేదని, కాకపోతే ఆ దిశగా పరిస్థితులు తీసుకెళ్లవద్దని ప్రజలను కోరుతున్నానని పేర్కొన్నారు..