ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి వ్యవహారం కొద్ది నెలలుగా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. బార్ యజమానుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులకు టార్గెట్లు పెట్టారని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఏప్రిల్‌లో ఆరోపించడం కలకలరం రేపింది. ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ కూడా రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్ పై వచ్చిన ఆరోపణపై ఇప్పటికే బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్‌ఐ అభిషేక్ తివారీ అనిల్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
ప్రాథమిక విచారణలో అనిల్ దేశ్‌ముఖ్‌కు క్లీన్‌చీట్ రానుందనే ప్రచారం జరగడంతో అనుమానాలకు తావిచ్చింది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఎస్‌ఐ అభిషేక్ తివారీ, అనిల్ దేశ్‌ముఖ్ న్యాయవాది ఆనంద్ దాగా, మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఎస్సై తివారీని బుధవారం నాడు అరెస్టు చేశారు..ఇవాళ న్యాయవాది ఆనంద్‌ను కూడా అరెస్టు చేశారు. మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ప్రాథమిక దర్యాప్తునకు ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు వెనక్కి తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలపై లాయర్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన్ని విచారణ కోసం ముంబై నుంచి ఢిల్లీ తీసుకుపోయారు.