ఎటూ తేలని ‘మహా’ పంచాయితీ.. సోనియా వ్యూహం సాగతీతేనా ?

25 రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర పొలిటికల్ పంచాయితీ సోమవారం కూడా ఎటూ తేలనే లేదు. సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ తర్వాత క్లారిటీ వస్తుందనుకున్న శివసేన ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. సోనియాతో భేటీకి ఢిల్లీకి వచ్చిన ఎన్సీపీ అధినేత ఆమెతో మీటింగ్ తర్వాత కూడా ఎటూ తేల్చలేదు. పైగా ప్రభుత్వ ఏర్పాటుపై అసలు సోనియాతో చర్చించనే లేదని బాంబు పేల్చారు శరద్ పవార్. నిజానికి శరద్ పవర్ ఢిల్లీ వెళుతున్నారంటూ రెండ్రోజుల క్రితం ప్రచారం మొదలైనప్పట్నించి […]

ఎటూ తేలని ‘మహా’ పంచాయితీ.. సోనియా వ్యూహం సాగతీతేనా ?
Rajesh Sharma

|

Nov 18, 2019 | 8:03 PM

25 రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర పొలిటికల్ పంచాయితీ సోమవారం కూడా ఎటూ తేలనే లేదు. సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ తర్వాత క్లారిటీ వస్తుందనుకున్న శివసేన ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. సోనియాతో భేటీకి ఢిల్లీకి వచ్చిన ఎన్సీపీ అధినేత ఆమెతో మీటింగ్ తర్వాత కూడా ఎటూ తేల్చలేదు. పైగా ప్రభుత్వ ఏర్పాటుపై అసలు సోనియాతో చర్చించనే లేదని బాంబు పేల్చారు శరద్ పవార్.

నిజానికి శరద్ పవర్ ఢిల్లీ వెళుతున్నారంటూ రెండ్రోజుల క్రితం ప్రచారం మొదలైనప్పట్నించి ఆయన వెళుతున్నది శివసేనతో కలిసేది లేనిది సోనియాతో చర్చించేందుకేనని అంతా భావించారు. దానికి తోడు శివసేన, ఎన్సీపీ నేతలు కూడా అదే చెప్పుకొచ్చారు. తీరా ఢిల్లీకి చేరుకున్న శరద్ పవర్ తాను.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో చర్చించలేదని కుండబద్దలు కొట్టారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపైనే చర్చలు జరిపామని అన్నారు.

శివసేనతో చర్చలు జరిపిన ఎన్సీపీ.. థాక్రేతో చేతులు కలిపేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ చిరకాలంగా యుపిఏలో కొనసాగుతున్నందున సోనియా గాంధీ మార్గదర్శకత్వాన్ని కాదని ముందుకెళ్ళలేని పరిస్థితి. అందుకే సోనియా నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వాలని శరద్ పవార్ భావిస్తున్నారని సమాచారం. అలాగని అందివచ్చిన అధికారాన్ని వదులు కునేందుకు శరద్ పవర్ సిద్దంగా లేనట్లు సమాచారం. కేవలం శివసేన, ఎన్సీపీ కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. వీరిద్దరికి కాంగ్రెస్ మద్దతు అనివార్యం. దాంతో సోనియా నిర్ణయంపైనే మహారాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఆధారపడి వుంది.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సోనియాతో భేటీ అయిన శరద్ పవర్.. కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య చర్చలు కొనసాగుతాయని, తాము మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదని శివసేన ఆశలపై నీళ్ళ జల్లారు. ఇంకో అడుగు ముందుకేసి శివసేనతో కలిసే అంశం అసలు సోనియాతో భేటీలో ప్రస్తావనకే రాలేదని శివసేన నేతలకు షాకిచ్చారు శరద్ పవర్. సో.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే అవకాశం లేదనిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

మరోవైపు బిజెపి-శివసేన మధ్య మధ్యవర్తిత్వాన్ని నెరపేందుకు రామ్‌దాస్ అథవాలే ముందుకొచ్చారు. మూడేళ్ళు బిజెపి, రెండేళ్ళు శివసేన ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే ప్రతిపాదనకు శివసేన ఓకే అయితే బిజెపిిని ఒప్పిస్తానని అథవాలే.. ఉద్దవ్ థాక్రేకు ప్రతిపాదించినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే.. ఆ ప్రతిపాదన బిజెపి వైపు నుంచి వస్తే పరిశీలిస్తామని థాక్రే స్పందించినట్లు సమాచారం. ఏది ఏమైనా మహారాష్ట్ర పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతూ ఆసక్తి కలిగిస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu