హైఅలర్ట్.. కొనసాగుతున్న ఆపరేషన్ స్లీపర్ సెల్స్.. భారీగా పట్టుబడుతున్న ఉగ్రవాద ఏజెంట్లు..
దేశమంతా హైఅలర్ట్ జోన్‌లోనే ఉంది. ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పట్టుబడుతుండడంతో.. భద్రతాబలగాలు మరింత అప్రమత్తమవుతున్నాయి. హర్యానాలో ఓ లేడీ యూట్యూబర్‌తో పాటు ఐదుగురు ఉగ్రవాద సానుభూతిపరులను నిఘా ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి. మహారాష్ట్రలో ఇన్నాళ్లూ పరారీలో ఉన్న ఇద్దరు స్లీపర్ సెల్స్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో పట్టుకున్నాయి భద్రతా ఏజెన్సీలు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం దాడి తర్వాత, స్లీపర్ సెల్స్‌పై మన బలగాలు మరింత ఫోకస్ పెంచాయి. పెహల్గామ్ దాడిలో లష్కర్-ఎ-తోయిబాతో సంబంధం ఉన్న ఆరుగురు స్లీపర్ సెల్ సభ్యులే కారణం. స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 20 ప్రదేశాలలో దాడులు చేసి, 15 మంది అనుమానితులను అరెస్టు చేసింది. ఇటు పంజాబ్‌లోనూ ఈ మధ్య ప్రమాదకర ఆయుధాలు బయటపడ్డాయి. రాకెట్ గ్రెనేడ్‌లు, హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఒక నగరాన్ని నాశనం చేయగల సామగ్రి మే 6న పట్టుబడింది. ఇది ISIపనిగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ముంబైలో శనివారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇద్దరు ISIS ఉగ్రవాదులు అబ్దుల్లా ఫైయాజ్ షేక్, తల్హా ఖాన్ – విమానాశ్రయంలో అరెస్టు చేసింది. బాంబులతో నగరాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నినట్లు సమాచారం. ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారన్నదానిపై విచారణ జరుగుతోంది.
నిందితులిద్దరూ 2023లో పూణెలో ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్ తయారీ కేసులో వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఈ కేసు సందర్భంగా రెండేళ్లుగా ఇద్దరూ పరారీలో ఉన్నారు. అబ్దుల్లా ఫైయాజ్ షేక్ తల్హా ఖాన్, NIA నుంచి తప్పించుకోవడానికి ఇండోనేషియాలోని జకార్తాకు పారిపోయారు. వారిపై ముంబై NIA స్పెషల్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్‌లు జారీ చేసింది, ఒక్కొక్కరిపై రూ. 3 లక్షల రివార్డు కూడా ఉంది. ఇన్నాళ్లూ జకార్తాలో నక్కిన ఇద్దరూ.. ముంబైలో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించాలన్న ప్లాన్‌తో తిరిగి ఇండియాకు వచ్చారు. అయితే ఎన్‌ఐఏ వీళ్లిద్దర్నీ వలపన్ని పట్టుకుంది.
హైదరాబాద్‌లోనూ స్లీపర్ సెల్స్ భయం పట్టుకుంది. మే 8న, స్థానిక స్లీపర్ సెల్స్ దాడులకు సిద్ధమవుతున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ ఏడాది జనవరిలో వరంగల్‌లో పాకిస్తానీ ఉగ్రవాది మహ్మద్ జక్రియా అనే స్లీపర్ సెల్ అరెస్టయ్యాడు.
గుజరాత్‌లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఓడరేవులను, రైల్వే స్టేషన్‌లను, జనసమూహాలను లక్ష్యంగా స్లీపర్ సెల్స్ దాడి చేయవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో భద్రతా బలగాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




