Hyderabad: వారంలోనే ఐదు ఘటనలు.. హైదరాబాద్ గ్యాంగ్ రేప్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..
గ్యాంగ్ రేప్ కేసు విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీచేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది.
Hyderabad Gangrape Case: హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్‌కు వెళ్లిన బాలికపై కొందరు సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) సీరియస్‌గా స్పందించింది. ఈ కేసు విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీచేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే ఈ వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని సూచించారు. ఈ వీడియోలను పోస్టు చేసే వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ కమిషన్ కోరింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్‌లో వారం వ్యవధిలో మైనర్ బాలికలపై ఐదు అత్యాచార కేసులు నమోదయ్యాయని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. హైదరాబాద్‌లో మైనర్లపై అత్యాచారం జరిగిన ఘటనల్లో రెండు కేసులు సోమవారం వచ్చినట్లు పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో బాలికలు, మహిళలపై నేరాల రేటు పెరుగుతుండడాన్ని కమిషన్ సీరియస్‌గా పరిగణించింది. నేరాలను అరికట్టడం, మహిళలను కాపాడటం మాత్రమే కాకుండా ఇటువంటి విషయాలలో వేగంగా తగిన చర్యలు తీసుకోవడం పోలీసుల పాత్ర అని కమిషన్ వివరించింది.
బాలికలు, మహిళల భద్రత, నేరాల అదుపు కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకున్న చర్యలపై ఏడు రోజుల్లోగా వివరణాత్మక నివేదిక పంపాలని మహిళా కమిషన్ సూచించింది. ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకోవాలని తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్‌కు (డీజీపీ) చైర్‌పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. ఈ లేఖ కాపీని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు కూడా ఆమె పంపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..