జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ మృతదేహం! అసలేం జరిగిందంటే..
నాగపట్నం జిల్లా కలెక్టరేట్‌లో 29 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ అభినయ మృతదేహం గన్‌షాట్ గాయంతో లభ్యమైంది. ఆదివారం ఉదయం ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సీలు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదమా లేక హత్యాయత్నమా అనేది ఇంకా తెలియదు.

నాగపట్నం జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. 29 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ మెడపై తుపాకీ గాయం ఉంది. మృతురాలిని మైలాపూర్ జిల్లాలోని మనకుడి నివాసి అభినయగా అధికారులు గుర్తించారు. ఆమె సాయుధ రిజర్వ్ ఫోర్స్‌లో పనిచేస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అభినయ శనివారం కలెక్టరేట్‌లో రాత్రి విధులకు మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి రిపోర్ట్ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కార్యాలయ ఆవరణలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని సమాచారం. డ్యూటీలో ఉన్న మరో కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి పరుగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు, అభినయ నేలపై పడి ఉంది. ఆమె మెడ ఎడమ వైపున తుపాకీ గాయం నుండి రక్తస్రావం అవుతోంది.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, ఒక ఇన్‌స్పెక్టర్ సహా సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. అభినయ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నాగపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని సీలు చేసి, ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోంది. కాల్పులకు గల కారణం అస్పష్టంగా ఉంది. ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది పోలీసులు నిర్ధారించలేదు. ఇంకా దర్యాప్తు జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
