Rajya Sabha polls: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి రూట్ క్లియర్..? రాజ్యసభకు ఎక్కడి నుంచి అంటే..
Mukhtar Abbas Naqvi: రాజ్యసభ సభ్యుల ప్రకటనలో బీజేపీ గందరగోళం.. ప్రముఖ నేతల పేర్లు గల్లంతు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది బీజేపీ. లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి(Mukhtar Abbas Naqvi) రూట్ క్లియర్ అయ్యింది. మంత్రి పదవి ముగుస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుల ప్రకటనలో బీజేపీ గందరగోళం.. ప్రముఖ నేతల పేర్లు గల్లంతు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది బీజేపీ. లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. నఖ్వీ రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూలై 7తో ముగుస్తోంది. జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించగా అందులో నఖ్వీ పేరు కనిపించలేదు. దీంతో మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ముగుస్తోంది. దీంతో ఆయనను బీజేపీ లోక్‌సభ సభ్యుడిగా బరిలోకి దింపనున్నట్లు వెల్లడైంది.
అయితే.. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన వారికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నిబంధన పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గానికి జూన్ 23న ఎన్నిక జరగనుంది. ఆ నియోజక వర్గ ఎంపీ పదవికి సమాజ్ వాదీ ఎంపీ అజాం ఖాన్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. నఖ్వీ కూడా రామ్‌పూర్ ప్రాంతానికే చెందిన నేత కావడంతో ఆయనను ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, నఖ్వీని గవర్నర్‌గా నియమిస్తారన్న ఊహాగానాలూ పెద్దగా వస్తున్నాయి.
ఇదిలావుంటే.. 15 రాష్ట్రాలకు చెందిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న పోలింగ్ జరుగనున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ పేర్లు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఉన్నాయి. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి పియూష్ గోయల్ మరోసారి పోటీ చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి పోటీ చేస్తున్నారు.