Census Notification 2025: పదిహేనేళ్ల తర్వాత తొలిసారి జనగణన.. నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
జన గణనపై నిన్న ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం సమీక్ష జరిపారు. 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో పూర్తి కానున్న జన, కుల గణన పూర్తి చేయాలని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈ రోజు (జూన్ 16) కేంద్రం జన గణన గెజిట్ నోటిఫికేషన్

న్యూఢిల్లీ, జూన్ 16: దేశంలో 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు జన గణన జరగనుంది. జన గణనపై నిన్న ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో పూర్తి కానున్న జన, కుల గణన పూర్తి చేయాలని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈ రోజు (జూన్ 16) కేంద్రం జన గణన గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. జనగణన కోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. డిజిటల్ రూపంలోనే ట్యాబ్ ల ద్వారా జనాభా లెక్కల సేకరణ సాగనుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కేంద్ర హోంశాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని హోంశాఖ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపింది. సెక్షన్ 3, జనగణన చట్టం, 1948 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు వివరించింది.
కాగా రెండు దశల్లో జరుగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వది. స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన ఇది. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతుంది. తొలి విడత ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి జరుగుతుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రెండో దశలో 2027, మార్చి 1 నుంచి జన గణనను చేపట్టనున్నారు. ఈసారి జనాభా లెక్కలతోపాటే కుల గణనను కూడా చేపట్టనున్నారు.
దేశంలో 1872 నుంచి జనగణన చేస్తున్నారు. సాధారణంగా జనగణనను పదేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. అప్పుడు కూడా రెండు విడుతల్లో ఈ ప్రక్రియ జరిగింది. ఆ ప్రకారంగా 2021లోనే జన గణనను నిర్వహించాలి. అయితే నాటి కొవిడ్ కల్లోలపరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో తాజాగా 16 ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా గణనను కేంద్రం ఉపక్రమించింది. జనాభా లెక్కల సేకరణకు కేంద్రం 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసింది. ఇక 2021లో జనగణన కోసం ప్రభుత్వం రూ.12,695.58 కోట్లను కేటాయించగా.. ఈసారి జనగణనకు రూ. 13 వేల కోట్ల వరకూ వ్యయం అయ్యే అవకాశం ఉండగా.. ప్రస్తుతానికి కేంద్రం 2025-26 బడ్జెట్‌లో కేవలం రూ. 574.80 కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








