MEIL: స్వదేశీ ల్యాండ్ రిగ్‌పై త్రివర్ణ పతాక రెపరెపలు.. ఆవిష్కరించిన ‘మేఘా’ గ్రూప్ చైర్మన్ పీపీ రెడ్డి
MEIL కంపెనీ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రిల్‌మెక్ ల్యాండ్ రిగ్ పై మొదటిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు. MEIL గ్రూప్ చైర్మన్ పీపీ రెడ్డి (PP reddy) త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
MEIL Group Independence Day Celebrations: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) కంపెనీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ICOMM నాగారం ఫెసిలిటీలో జరిగిన వేడుకల్లో MEIL కంపెనీ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రిల్‌మెక్ ల్యాండ్ రిగ్ పై మొదటిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు. MEIL గ్రూప్ చైర్మన్ పీపీ రెడ్డి (PP reddy) త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పీపీ రెడ్డి మాట్లాడుతూ.. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ల్యాండ్ రిగ్ ప్లాట్‌ఫాంపై జాతీయ జెండాను ఎగురవేయడం మరిచిపోలేనిదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్వదేశీ రిగ్‌పై జాతీయ జెండాను ఎగురవేయడం తన కల అని.. తన ఆకాంక్షలను నెరవేర్చినందుకు ధన్యవాదాలంటూ పీపీ రెడ్డి కృతజ్ణతలు తెలిపారు.
అత్యాధునిక టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడంలో విజయం సాధించడానికి కృషిచేసిన సిబ్బందిని పి.వి. కృష్ణారెడ్డి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంఈఐఎల్ అతి తక్కువ వ్యవధిలో దేశంలోనే నెంబర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా ఎదిగిందన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మౌళిక వసతులు, పవర్, హైడ్రోకార్బన్స్ ప్రాజెక్టులను నిర్మించిందని ఆయన పేర్కొన్నారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 6 నుంచి 12 తరగతుల్లో చదువుతున్న 750 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 75,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రత్యేక కమిటీ అర్హత ప్రమాణాలను ఖరారు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో MEIL, ICOMM ఉన్నత స్థాయి సభ్యులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఈఐఎల్ డైరక్టర్ శ్రీరవిరెడ్డి ముగింపు ప్రసంగం ఇచ్చారు.
టెస్టింగ్ దశలో ప్రతిష్టాత్మక రిగ్..
అగర్తలాలోని ఓఎన్జీసీ యూనిట్ కోసం తయారు చేసిన 2000 HP సామర్థ్యం కలిగిన ఈ రిగ్ ప్రస్తుతం సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ దశలోఉంది. ఈ రిగ్ 6,000 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయగలదు. దేశీయంగా తయారైన అత్యంత ఆధునిక రిగ్గుల్లో ఇదొకటి. కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానానికి అనుగుణంగా ఈ రిగ్ ను మెయిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తోంది.
1989 నుంచి ICOMM సేవలు
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ కంపెనీలో ఒకటైన ICOMM టెలి లిమిటెడ్‌ను 1989 లోస్థాపించారు.120 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సంస్థ.. ఉత్పత్తి రూపకల్పన, ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. ICOMM పవర్, టెలికాం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి క్లిష్టమైన పరిశ్రమలకు అత్యాధునిక సేవలు అందిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..