ట్రంప్ దేవాయనమ: వరంగల్ వాసికి ఈయనే దేవుడు!

ట్రంపే లోకం, ట్రంపే సర్వస్వం... ఎవరైనా సహజంగా దేవుడికి పూజలు చేస్తారు.. కానీ అతను మాత్రం నిత్యం ట్రంప్‌కే పూజలు చేస్తుంటాడు. మామూలు పూజలు కాదు రక్తాభిషేకం చేసేంత వీరభక్తుడు..

ట్రంప్ దేవాయనమ: వరంగల్ వాసికి ఈయనే దేవుడు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:40 PM

ట్రంపే లోకం, ట్రంపే సర్వస్వం… ఎవరైనా సహజంగా దేవుడికి పూజలు చేస్తారు.. కానీ అతను మాత్రం నిత్యం ట్రంప్‌కే పూజలు చేస్తుంటాడు. మామూలు పూజలు కాదు రక్తాభిషేకం చేసేంత వీరభక్తుడు. ఏకంగా ట్రంప్‌కు గుడికట్టి ఆరాధిస్తున్న ఆ వీరభక్తుడు. ఇంటిముందు ఓ ట్రంప్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాడు. అతని భక్తి గురించి తెలుసుకున్న ట్రంప్ త్వరలో కలుసుకుంటానని ట్నిట్టర్‌లో సందేశం పంపారు. ప్రస్తుతం ఇండియాలో ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఈ వీరాభిమాని మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఆ వీరాభిమానిని చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే..

ఇతను జనగామ జిల్లా భచ్చన్నపేటలోని కొన్నే గ్రామానికి చెందిన వాడు. ఇతని పేరూ కృష్ణ అలియాస్ క్రిష్.. తన ఇంటివద్ద కిరాణ దుకాణం నడుపుకుంటూ, వ్యవసాయం సాగు చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వీరాభిమానిగా మారాడు. ఎందుకని ప్రశ్నిస్తే ట్రంప్ వ్యవహారశైలి, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఈయనకు విపరీతంగా నచ్చాయట. దీంతో వెంటనే తన ఇంట్లో ట్రంప్‌కు పూజా మందిరాన్ని నిర్మించి.. ట్రంప్ ఫోటోకు నిత్యపూజలు, అభిషేకాలు, హారతులు ఇస్తున్నాడు.

అంతేకాదు… ఏకంగా ట్రంప్‌కు ఏడుడుగుల విగ్రహాన్ని నిర్మించాడు. తన ఇంటిముందు ట్రంప్ విగ్రహాన్ని స్థాపించిన కృష్ణ… గతయేడాది ట్రంప్ జన్మదినం సందర్బంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నాడు. ప్రతిరోజు ఈ విగ్రహానికి పూలమాలవేసి ఆరాధిస్తున్నాడు. అతేకాకుండా క్రిష్, ట్రంప్ ఫోటోతో తీర్ధయాత్రలు చేస్తుంటాడు. ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, జలాశయాలలో ట్రంప్ ఫోటోకు అభిషేకాలు చేస్తుంటాడు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆమే ఆరోగ్యం బాగుపడాలని ట్రంప్ చిత్రపటం వద్ద జపం చేశాడు. ట్రంప్ ఫోటోకు ఫ్రేమ్ కట్టించి నిత్యపూజలు చేస్తూ.. జై ట్రంప్.. జైజై ట్రంప్ అంటూ నిత్యం జపం చేస్తుంటాడు.

హారతులు, అభిషేకాలు, నిత్య పూజలతో దేశంలో ప్రత్యేక ఆకర్షనగా మారాడు. ఇతని వీరభక్తిని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏడాది క్రిందట స్పందించాడు. వందకోట్ల మంది బారతీయులలో క్రిష్ ఒక్కడే తనకు స్పెషల్ అని ట్విట్ చేశాడు. త్వరలోనే ఈ వీరభక్తున్ని కలుసుకుంటానని సందేశం పంపాడు. అయితే ప్రస్తుతం ఇండియాలోట్రంప్ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఎలాగైనా ట్రంప్‌ను కలవాలని తహతహలాడుతున్నాడు.. ఈ అభిమాని. మరి అవకాశం వస్తుందో లేదో చూడాలి.