4 లక్షలు కాదు, 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం, రైతు నేత రాకేష్ తికాయత్
త్వరలో ఢిల్లీ మార్చ్ కు పిలుపునిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. ఈ ఆందోళన సందర్భంగా నాలుగు లక్షలు కాదు..40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని ఆయన చెప్పారు.
త్వరలో ఢిల్లీ మార్చ్ కు పిలుపునిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. ఈ ఆందోళన సందర్భంగా నాలుగు లక్షలు కాదు..40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని ఆయన చెప్పారు. రాజస్తాన్ లోని సికార్ లో నిన్నజరిగిన మహాపంచాయత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఏ క్షణమైనా ఇందుకు పిలుపునిస్తామన్నారు. ఈ సారి పార్లమెంట్ ఘెరావో కు పూనుకొంటాం..నాలుగు లక్షల బదులు నలభై లక్షల ట్రాక్టర్లతో చట్టసభను ఘెరావో చేస్తాం.. ముందుగా ప్రకటించి మరీ ఈ భారీ నిరసనకు దిగుతాం అని ఆయన అన్నారు. ప్రొటెస్ట్ చేస్తున్న రైతులు ఇండియా గేట్ వద్ద గల పార్కులను దున్నుతారని, అక్కడ పంటలు పండించే కార్యక్రమాన్ని చేపడుతారని ఆయన అన్నారు.పార్లమెంటును ఎప్పుడు ముట్టడించాలో… ఆ తేదీని యునైటెడ్ ఫ్రంట్ నాయకులు నిర్ణయిస్తారని తికాయత్ చెప్పారు.
రైతు చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండును వీడేది లేదని, వీటిని కేంద్రం రద్దు చేయకపోతే, కనీస మద్దతుధరను అమలు చేయకపోతే అన్నదాతలు బడా కంపెనీల ఆధ్వర్యంలోని గోడౌన్లను కూల్చివేస్తారని ఆయన హెచ్ఛరించారు. ఇందుకు కూడా యునైటెడ్ ఫ్రంట్ త్వరలో తేదీని ప్రకటిస్తుందన్నారు. గత జనవరి 26 న రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా వారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. ఈ దేశ జాతీయ పతాకాన్ని అన్నదాతలు గౌరవిస్తారని, కానీ దేశాన్ని తప్పుదారి పట్టించే విధంగా నాడు అక్కడ కొన్ని ఘటనలు జరిగాయని తికాయత్ విచారం వ్యక్తం చేశారు.