AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maratha Reservation: ఫిబ్రవరి 10 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు

మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే-పాటిల్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఫిబ్రవరి 10 నుండి జాల్నాలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విరుద్ధమైన ప్రకటనలు చేశారని విమర్శించారు. మరాఠాలందరికీ కుంబీ సర్టిఫికెట్లు జారీ చేయాలని జరంగే-పాటిల్ డిమాండ్ చేస్తున్నారు.

Maratha Reservation: ఫిబ్రవరి 10 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు
Manoj Jarange Patil
Balaraju Goud
|

Updated on: Jan 31, 2024 | 12:03 PM

Share

మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే-పాటిల్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఫిబ్రవరి 10 నుండి జాల్నాలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విరుద్ధమైన ప్రకటనలు చేశారని విమర్శించారు. మరాఠాలందరికీ కుంబీ సర్టిఫికెట్లు జారీ చేయాలని జరంగే-పాటిల్ డిమాండ్ చేస్తున్నారు.

కుంబీ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే ఫిబ్రవరి 10 నుంచి మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని మనోజ్ జరంగే పాటిల్ తెలిపారు. మరాఠా వర్గానికి పూర్తిగా కుంబీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం ప్రారంభించకపోతే, ఓబీసీ వర్గానికి ఇచ్చిన 27 శాతం రిజర్వేషన్‌ను కోర్టులో సవాలు చేస్తామని జరంగే పాటిల్ అన్నారు. అయితే జరంగే పాటిల్ తీరును జాతీయ ఓబీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు తయావాడే తప్పుబట్టారు. రద్దు చేయలేని మండల్ కమిషన్ ద్వారా ఓబీసీ రిజర్వేషన్లు సాధించామని తయావాడే తెలిపారు. మనోజ్ జరంగేకు న్యాయ పరిజ్ఞానం లేదని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని, దీని వల్ల ఓబీసీ వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

రాయ్‌గఢ్ పర్యటనలో ఉన్న మరాఠా నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ మహారాష్ట్ర సర్కార్ తీరుపై మండిపడ్డారు. మరాఠా వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. మరాఠా కమ్యూనిటీ ప్రజలకు కుంబీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ప్రభుత్వం తన హామీని నెరవేర్చకపోతే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ పాత్ర పోషిస్తోందని మనోజ్ జరంగే ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశంపై ముఖ్యమంత్రి సంతకం ఉందని చెప్పారు. ఈ ఆదేశంపై అభ్యంతరాలు ఉన్నా, ప్రభుత్వం 15 రోజుల్లోగా ఈ ఆదేశాన్ని చట్టంగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే మరాఠా రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. మనోజ్ జరంగే పాటిల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మండిపడ్డారు. ఓబీసీ వర్గాలకు అన్యాయం జరగడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. అవసరమైతే బీజేపీ అగ్రనేతలతో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించలేదని మంత్రి ఛగన్ భుజ్‌బల్ స్పష్టంగా చెప్పారు. మంత్రివర్గాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండానే ముఖ్యమంత్రి ఈ ముసాయిదాపై సంతకం చేశారు. ఓబీసీ పక్షం నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండదని ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారని, ఓబీసీ వర్గాన్ని తన కాళ్ల కింద తొక్కేయడమే కాకుండా ఓబీసీ కోటా నుంచి మరాఠా సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించేందుకు ముసాయిదా రూపొందించారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే మాట్లాడుతూ ఓబీసీ వర్గానికి ఎలాంటి చిన్న నష్టం జరగనివ్వబోమన్నారు. ఈ విషయం చర్చల ద్వారా పరిష్కరించకుంటామన్నారు. రిజర్వేషన్ల కోసమే కుంబీ కుల ధృవీకరణ పత్రాన్ని మరాఠాలు ఎవరూ తీసుకోరని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కుమారుడు, మాజీ ఎంపీ నీలేష్ రాణే అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని, దీనిపై తమ నిరసనలు తెలుపుతామన్నారు.

జనవరి 20న, OBCలకు కేటాయించిన కోటా కింద ప్రయోజనాలు పొందేందుకు మరాఠాలందరికీ కుంబీ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ జరంగే-పాటిల్ అంతర్వాలి సారథి నుండి నావీ ముంబైలోని వాషికి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆ మరుసటి రోజు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జనవరి 27న అతనిని కలుసుకుని, తన డిమాండ్‌ను లిఖితపూర్వకంగా నెరవేరుస్తానని వాగ్దానం చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాపీని అతనికి అందజేశారు. ఆ వెంటనే తన మార్చ్‌ను ముగించాడు. ఫిబ్రవరి 16 వరకు నోటిఫికేషన్‌పై సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఆ తర్వాత ఆర్డినెన్స్‌ ద్వారా రిజర్వేషన్లను ఆమోదించాలని భావిస్తోంది మహారాష్ట్ర సర్కార్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…