PM Modi: విపత్తు సమయంలోనూ జమ్మూకశ్మీర్ విజయాలు.. మన్ కీ బాత్‌లో మోదీ ఏమన్నారంటే..?..
జమ్మూకశ్మీర్ విపత్తు సమయంలోనూ విజయాలు సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అవి తెలుసుకుంటే ప్రజలు సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పారు. మన్ కీ బాత్‌లో ప్రధాని కీలక అంశాలపై మాట్లాడారు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు దేశంలో విధ్వంసం సృష్టించాయని అన్నారు. ఇళ్ళు ధ్వంసమయ్యాయి, పొలాలు నీట మునిగాయి, మొత్తం కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. గత కొన్ని వారాలుగా దేశంలో వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల జరిగిన భారీ విధ్వంసం, ప్రాణనష్టంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు, పొలాలు నాశనం కావడం, కుటుంబాలు తుడిచిపెట్టుకుపోవడం, వంతెనలు, రోడ్లు కొట్టుకుపోవడం వంటి సంఘటనలు ప్రతి భారతీయుడిని బాధపెట్టాయని అన్నారు.
కష్టకాలంలో అండగా..
ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో పాలుపంచుకున్న సైన్యం, స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు. హెలికాప్టర్ల ద్వారా సహాయ సామగ్రిని పంపిణీ చేయడం, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడం వంటి పనులను ప్రశంసించారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారని కొనియాడారు.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక విజయాలు:
వరదలు, వర్షాల వల్ల దేశం వినాశనాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ.. జమ్మూ కాశ్మీర్ రెండు ప్రత్యేక విజయాలు సాధించిందని మోదీ తెలిపారు. చాలా మంది వీటిని గమనించలేదని.. కానీ ఆ విజయాల గురించి తెలుసుకుంటే సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పారు. పుల్వామాలోని స్టేడియంలో రికార్డు స్థాయిలో ప్రజలు గుమిగూడారని తెలిపారు.
పుల్వామాలో డే-నైట్ క్రికెట్ మ్యాచ్
గతంలో అసాధ్యమైనదిగా భావించిన పుల్వామాలో తొలిసారిగా డే-నైట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారని మోదీ అన్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ నుండి అనేక జట్లు పాల్గొన్న రాయల్ ప్రీమియర్ లీగ్‌లో ఒక భాగమని వివరించారు. ఈ సంఘటన దేశం ఎలా మారుతుందో చూపిస్తోందన్నారు.
దాల్ సరస్సులో జల క్రీడలు
దేశంలోనే మొట్టమొదటి ‘ఖేలో ఇండియా అక్వాటిక్ స్పోర్ట్స్ ఫెస్టివల్’ శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో జల క్రీడలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. దేశం నలుమూలల నుండి 800 మందికి పైగా అథ్లెట్లు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మహిళా అథ్లెట్లు కూడా పురుషులతో సమానంగా పాల్గొని తమ సత్తా చాటారు. ప్రకృతి వైపరీత్యాల మధ్య కూడా ఈ ప్రత్యేక విజయాలు దేశానికి ఆనందాన్ని ఇస్తాయని ప్రధాని మోదీ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




