Crime News: దొంగతనం చేశాడనే అనుమానంతో వ్యక్తిని చావగొట్టిన మరో వ్యక్తి
దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చావగొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని చందన్‌నగర్‌లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందన్‌నగర్ మున్సిపాలిటీలోని వార్డ్ నంబర్ 24లోని చాల్కే పరిసరాల్లో నివాసం ఉండే షేక్ నజ్రుల్ (42) ఢిల్లీ రోడ్డులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నజ్రుల్, అతని కుమారుడు మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కొన్ని ఇనుప పరికరాలను విక్రయించడానికి సమీపంలోని మార్కెట్‌కు వెళుతున్నాడు. ఈ క్రమంలో చందన్‌నగర్‌లోని..

చందన్‌నగర్, డిసెంబర్ 5: దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చావగొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని చందన్‌నగర్‌లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందన్‌నగర్ మున్సిపాలిటీలోని వార్డ్ నంబర్ 24లోని చాల్కే పరిసరాల్లో నివాసం ఉండే షేక్ నజ్రుల్ (42) ఢిల్లీ రోడ్డులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నజ్రుల్, అతని కుమారుడు మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కొన్ని ఇనుప పరికరాలను విక్రయించడానికి సమీపంలోని మార్కెట్‌కు వెళుతున్నాడు. ఈ క్రమంలో చందన్‌నగర్‌లోని లాల్దీఘి వెంబడి వెల్‌కమ్ లాడ్జ్ ముందుకు రాగానే సాను ఛటర్జీ అలియాస్ భోలా అనే అతను అడ్డగించాడు. దొంగిలించిన వస్తువులను ఎక్కడికి తీసుకెళ్తున్నావని అతన్ని ప్రశ్నించాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన నజ్రుల్, తన కొడుకును అక్కడి నుంచి పారిపొమ్మని చెప్పాడు. దీంతో భోలా అతనిపై దాడి చేశాడు. నజ్రుల్ ఛాతీ, కడుపుపై తన్నడంతో, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో భోలా అతన్ని రోడ్డు పక్కన వదిలి పారిపోయాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నజ్రుల్‌ను చందన్‌నగర్ డివిజనల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న చందన్‌నగర్ పోలీస్‌స్టేషన్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పలు కేసుల్లో దోషిగా ఉన్న భోలా కొద్ది రోజుల క్రితం జైలు నుంచి విడుదలై బయటికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. భోలా చందన్‌నగర్ నీచుపట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనలో మరెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నజ్రుల్ కుమారుడు షేక్ రాహుల్ మాట్లాడుతూ.. భోలా తమను మార్గం మధ్యలో ఆపి, దొంగిలించిన వస్తువులను ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ తన తండ్రిని కొట్టడం ప్రారంభించాడని తెలిపాడు. ఇంతలో తనను వెళ్లిపొమ్మని తండ్రి నజ్రూల్ చెప్పాడన్నాడు. వెంటనే రాహుల్ తమ మామయ్యని పిలుచుకురావడానికి వెళ్లానని తెలిపాడు. తిరిగి తాము వచ్చేటప్పటికీ అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకున్నామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.